ఒళ్లు బలిసిందా? కళ్లు నెత్తికెక్కినయా?..పోలీసులపై నిజామాబాద్‌‌ ఎంపీ అర్వింద్ బూతులు

ఒళ్లు బలిసిందా? కళ్లు నెత్తికెక్కినయా?..పోలీసులపై నిజామాబాద్‌‌ ఎంపీ అర్వింద్ బూతులు
  • పోలీసోళ్ల దిమాక్​ ఖరాబైంది..యూస్‌‌లెస్​ ఫెల్లోస్‌‌​ అంటూ తిట్ల దండకం
  • సంగారెడ్డిలో కాంగ్రెస్‌‌ నేత జగ్గారెడ్డి వర్సెస్‌‌ సీఐ
  • సీఐ సహకారంతో రిగ్గింగ్‌‌ జరుగుతున్నదన్న ఆరోపణలతో ముదిరిన వివాదం
  • సీఐని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్

నిజామాబాద్/సంగారెడ్డి, వెలుగు:  ఎలక్షన్‌‌ డ్యూటీలో ఉన్న పోలీసులపై నిజామాబాద్​ఎంపీ ధర్మపురి అర్వింద్​రెచ్చిపోయారు. పోలింగ్​బూత్​నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకెట్లా పంపారంటూ మండిపడ్డారు. ‘‘క్యాండిడేట్‌‌ను బయటకు పంపింది ఎవడు? ఒళ్లు బలిసిందా? కళ్లు నెత్తికెక్కినయా? పోలీసోళ్ల దిమాక్‌‌ ఖరాబైంది.. యూస్​లెస్​ఫెల్లోస్.. క్యాండిడేట్‌‌ను బయటకు పంపేటోడ్ని తన్నుకుంటూ బయటకు తీసుకురండి.

వాడు పోలీసోడుగానీ ఇంకెవరైనాగానీ’’అంటూ ఊగిపోయారు. నిజామాబాద్​ కార్పొరేషన్​ 34 డివిజన్‌‌లో బంటు ప్రీతి బీజేపీ క్యాండిడేట్‌‌గా బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం అర్వింద్​ ఆవేశంగా హరిచరణ్​ మార్వాడీ స్కూల్‌‌లోని పోలింగ్ సెంటర్‌‌‌‌కు వచ్చి బంటు ప్రీతి భర్త బంటు ప్రవీణ్‌‌ను పోలింగ్​ సెంటర్​నుంచి ఎవరు బయటకు పంపారని మండిపడ్డారు. ‘‘పోరా నువ్వు లోపలికి పో.. నువ్వు క్యాండిడేట్‌‌వు.

ఎవడన్నా పొమ్మంటే తన్నుకుంట బయటకు తీస్కరా? వాడి పేరు చెప్పు నాకు.. తన్నులు తింటరు నా కొడుకులు” అంటూ చిందులేశారు. ‘ఉంటే ఉంటం.. లేకుంటే సస్పెండ్​ అయితం’ అని ఓ ఆఫీసర్​ అన్నాడని పోలింగ్​ ఏజెంట్ చెప్పగా..‘‘సూపెట్టు ఎవడాడు?’అంటూ పోలింగ్​ సెంటర్‌‌‌‌లోకి అర్వింద్‌‌ దూసుకెళ్లారు. ఓపీవోను ఏజెంట్‌‌ చూపించగా.. ‘‘నువ్వు ఎక్కడినుంచి వచ్చినవ్‌‌.. ఇక్కడేం చేస్తున్నవ్​.. నా క్యాండిడేట్‌‌ను బయటకు పొమ్మని నువ్వెట్లా చెప్తవ్.. మర్యాదగా నడుచుకో” అంటూ అర్వింద్‌‌ ఫైర్‌‌‌‌ అయ్యారు.  ‘వీడియో తీస్తున్నారు సార్‌‌’‌‌ అని ఓపీవో చెప్పగా.. ‘‘నువ్వు దొంగతనం చేస్తున్నవ్​అందుకే వీడియో తీస్తరు. క్యాండిడేట్​ కంప్లైంట్‌‌​ఇస్తే చెక్​ చేయాలెకదా? సిగ్గుండాలె’’ అంటూ పక్కనున్న మరో పోలింగ్​బూత్‌‌లోకి వెళ్లారు.

ముస్లిం మహిళల బురకాలు తీయించి చెక్​ చేశాకే ఓటు వేయనివ్వాలని పోలింగ్​ఏజెంట్లకు ఆర్డర్‌‌‌‌ వేశారు.  ఒకరి పేర్లతో ఉన్న ఓట్లను ఇతర ముస్లిం మహిళలు వేసి వెళ్లడం సిగ్గుచేటన్నారు. ‘‘లోపలున్న క్యాండిడేట్​ మళ్లీ బయటకు రావద్దు. పంపినట్లు నాకు ఫోన్​ రావద్దు” అంటూ అక్కడ డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ నారాయణకు సూచించారు. అంతకుముందు 7వ డివిజన్‌‌లో కాంగ్రెస్‌‌కు అనుకూలంగా ఓటేయాలని  ఓటర్లకు ఓ పోలీస్​ కానిస్టేబుల్ చెబుతున్నాడని ప్రచారం జరగడంతో అక్కడికి ఎంపీ అర్వింద్ వచ్చారు. పోలీస్​ఆఫీసర్లు వెంటనే సదరు కానిస్టేబుల్‌‌ను అక్కడే చేంజ్​ చేసి మరొకరిని నియమించారు. కాంగ్రెస్​కు అనుకూలంగా ప్రచారం చేసిన కానిస్టేబుల్‌‌పై యాక్షన్​ తీసుకోవాలని ఎంపీ డిమాండ్​ చేశారు. 

జగ్గారెడ్డి తీరుపై ఎన్నికల కమిషన్ సీరియస్

జగ్గారెడ్డిపై స్టేట్ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఎస్‌‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు.  పోలీసులు, సిబ్బంది భయపడేలా జగ్గారెడ్డి తీరు ఉందన్నారు.   పోలీసులపై బూతులు మాట్లాడిన  జగ్గారెడ్డిపై డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.  ఆయను బైండోవర్‌‌‌‌ చేయాలని కోరారు.    

జగ్గారెడ్డి వర్సెస్ సీఐ ​ ​

సంగారెడ్డిలో  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పట్టణ సీఐకి మధ్య గొడవ జరిగింది.  పట్టణంలోని 34వ వార్డు పోలింగ్‌‌ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌‌ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ.. 34 వార్డు కాంగ్రెస్‌‌ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపిస్తూ సీనియర్‌‌ నేత జగ్గారెడ్డి పోలింగ్‌‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్‌‌ ఆపేస్తామంటూ బూత్‌‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి రిగ్గింగ్‌‌కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

సీఐని సస్పెండ్‌‌ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవడంతో తోపులాట జరిగింది. అక్కడ నుంచి వెళ్లిపోయిన సీఐని పిలిపించాలని , అప్పటివరకు కదలబోనని డీఎస్పీ సత్తయ్యతో  జగ్గారెడ్డి వాదనకు దిగారు. అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు చేరుకొని.. సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో  జగ్గారెడ్డి శాంతించారు. ఆ తర్వాత సీఐ శివకుమార్‌‌‌‌పై డీఎస్పీకి కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. 

ఎంపీ అర్వింద్‌‌పై కేసు

ఎన్నికల నిబంధనలు అతిక్రమించి, పోలీసులను పరుష పదజాలంతో దూషించిన ఎంపీ అర్వింద్​ధర్మపురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌‌ టౌన్​ ఎస్‌‌హెచ్‌‌వో బి.రఘుపతి తెలిపారు. బుధవారం హరిచరణ్​ మార్వాడీ స్కూల్​ పోలింగ్​సెంటర్​ వద్ద డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ గుర్రం నారాయణ, హెడ్​కానిస్టేబుల్​సలీం, కానిస్టేబుల్​బి.గోవర్ధన్, శ్రీనివాస్​ వద్దకు కార్యకర్తలతో వచ్చిన ఎంపీ అర్వింద్.. వారిపై అసభ్యకరంగా మాట్లాడారని చెప్పారు. పండు అలియాస్​ బంటు ప్రవీణ్​ అనే కార్యకర్తను పోలింగ్​సెంటర్‌‌‌‌లోకి వెళ్లాలంటూ పురామాయించారని, అడ్డుచెప్పే వారు పోలీస్​ అయినా తన్నుకుంటూ బయటకు తీసుకురా అని రెచ్చగొట్టే కామెంట్స్​ చేశారన్నారు. పోలీసులు వద్దని వారించినా ఏడెనిమిది మంది కార్యకర్తలను వెంటేసుకొని వీడియో కెమెరా, స్టిల్​ కెమెరాతో 285, 286, 287 పోలింగ్​బూత్‌‌లలోకి  ప్రవేశించి పోలింగ్​ స్టాఫ్​ను కూడా మందలించి.. భయభ్రాంతులకు గురిచేశారన్నారు. వారి విధులకు ఆటంకం కలిగించారని చెప్పారు. రూల్స్​ అతిక్రమించంతోపాటు పోలీసులను, పోలింగ్​ స్టాఫ్‌‌ను తిట్టి బెదిరించడంతో సెక్షన్​ 132, 223, 296 (బీ) బీఎన్​ఎస్, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్​ 2019 ప్రకారం సెక్షన్​ 226 కింద కేసు నమోదు చేశామని రఘుపతి వెల్లడించారు.