కాకా టీ 20 లీగ్ విజేతగా నిజామాబాద్‌‌.. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఖమ్మంపై గెలుపు

కాకా టీ 20 లీగ్ విజేతగా నిజామాబాద్‌‌.. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఖమ్మంపై గెలుపు
  • ట్రోఫీ, రూ.5 లక్షల ప్రైజ్‌‌మనీ సొంతం
  • రన్నరప్‌‌గా ఖమ్మం, నల్గొండకు థర్డ్ ప్లేస్‌‌
  • అట్టహాసంగా మెగా టోర్నమెంట్‌‌ ముగింపు వేడుకలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20  లీగ్ గ్రాండ్ సక్సెస్‌‌ అయింది. విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌షిప్‌‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ)  ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో జరిగిన ఈ మెగా టోర్నీలో నిజామాబాద్ జట్టు చాంపియన్‌‌గా నిలిచింది. శనివారం సికింద్రాబాద్‌‌లోని జింఖానా గ్రౌండ్‌‌లో జరిగిన ఫైనల్లో నిజామాబాద్ 7 వికెట్ల తేడాతో ఖమ్మం జట్టును చిత్తు చేసి ట్రోఫీ, రూ.5 లక్షల ప్రైజ్‌‌మనీ గెలుచుకుంది. 

ఖమ్మం రన్నరప్ కప్‌‌‌‌, రూ.3 లక్షల ప్రైజ్‌‌‌‌మనీ అందుకుంది. నల్గొండ జట్టు థర్డ్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఆ జట్టుకు రూ.2 లక్షలు, నాలుగో ప్లేస్‌‌‌‌లో నిలిచిన ఆదిలాబాద్‌‌‌‌కు  రూ.లక్ష ప్రైజ్‌‌‌‌మనీ లభించాయి. టోర్నీ ముంగిపు వేడుకకు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జూబ్లీహిల్స్‌‌‌‌ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఈఐఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి హాజరై విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్‌‌‌‌మనీ అందించారు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, టోర్నమెంట్ డైరెక్టర్ ఆగంరావు, వివిధ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫైనల్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌సైడ్‌‌‌‌.. 

టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఖమ్మం 19.5 ఓవర్లలో 114 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో విశాల్ యాదవ్ (31), బన్నీ (18) టాప్ స్కోరర్లుగా నిలిచారు.  ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఖమ్మం బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. నిజామాబాద్ బౌలర్లలో సాయి ప్రతీక్ (3/11) మూడు వికెట్లతో కట్టడి చేయగా.. కెప్టెన్ విక్రమ్ జాదవ్ (2/18), రాహుల్ యాదవ్ (2/29) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓపెనర్ హర్షవర్ధన్ సింగ్ (37 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 69) దంచికొట్టడంతో నిజామాబాద్ జట్టు 12 ఓవర్లలోనే 115/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. మరో ఓపెనర్ శ్రీకర్ రెడ్డి (2) నిరాశ పరిచినా.. అజిత్‌‌‌‌ (38)తో కలిసి హర్షవర్ధన్‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌కు 86 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ చేసి జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు (రూ.5 వేలు) లభించింది. 

32 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ.. నల్గొండ విక్టరీ

మూడో ప్లేస్ కోసం నిర్వహించిన మ్యాచ్‌‌‌‌లో నల్గొండ జట్టు 84 రన్స్ తేడాతో ఆదిలాబాద్‌‌‌‌ను ఓడించింది. ఆ జట్టు బ్యాటర్ సాయినాథ్ (38 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 13 సిక్సర్లతో 121) సెంచరీతో విజృంభించాడు. దాంతో టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన నల్గొండ నిర్ణీత 15 ఓవర్లలో 232/6 భారీ స్కోరు చేసింది. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సాయినాథ్ 32 బాల్స్‌‌‌‌లోనే టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టి ఔరా అనిపించాడు. శ్రీనాథ్ యాదవ్ (58) ఫిఫ్టీతో రాణించాడు. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో ఆదిలాబాద్ 15 ఓవర్లలో 148/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. మొహమ్మద్ అఫ్సాన్‌‌‌‌ (55 నాటౌట్‌‌‌‌), సంతోష్ (44) పోరాడినా ఫలితం లేకపోయింది. భరత్ రెడ్డి మూడు వికెట్లు పడగొట్టాడు. సాయినాథ్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సాయి ప్రతీక్‌‌‌‌

కాకా వెంకటస్వామి వర్ధంతి (డిసెంబర్ 22) రోజున మొదలై.. 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 20 మైదానాల్లో జరిగిన ఈ టోర్నీలో దాదాపు 500 మంది క్రికెటర్లు పాల్గొని తమ టాలెంట్ నిరూపించుకున్నారు. విన్నర్ టీమ్ నిజామాబాద్ జట్టు క్రికెటర్ సాయి ప్రతీక్‌‌‌‌ 231 రన్స్ చేసి, 23 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆప్​ ద టోర్నమెంట్‌‌‌‌గా నిలిచాడు. అవార్డుతో పాటు రూ.20 వేల క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నాడు. టోర్నీ బెస్ట్ బౌలర్‌‌‌‌‌‌‌‌ అవార్డు కూడా నెగ్గి మరో రూ.10 వేల చెక్‌‌‌‌ అందుకున్నాడు. ఆదిలాబాద్‌‌‌‌కు చెందిన సంతోష్‌‌‌‌ టోర్నీలో బెస్ట్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా నిలవగా, నిజామాబాద్‌‌‌‌కు చెందిన హర్షవర్ధన్ బెస్ట్ ఫీల్డర్‌‌‌‌‌‌‌‌గా, నల్గొండకు చెందిన సాయినాథ్ బెస్ట్ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ నిలిచారు. వీరికి తలో రూ.10 వేల క్యాష్ ప్రైజ్‌‌‌‌ విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ అందజేసింది. 

జిల్లా క్రికెటర్లకు సన్మానం

వివిధ బీసీసీఐ టోర్నీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన 8 మంది  జిల్లా క్రికెటర్లను హెచ్‌‌‌‌సీఏ సన్మానించింది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్‌‌‌‌పై డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన అమన్ రావు (కరీంనగర్)తో పాటు కె.హిమతేజ (ఆదిలాబాద్‌‌‌‌), మహ్మద్ ఆఫ్రిది, మహ్మద్ అర్ఫాజ్ (మెదక్‌‌‌‌), అనికేత్ రెడ్డి (నిజామాబాద్‌‌‌‌), నారాయణ్ తేజ (ఖమ్మం), అరుణ్, గణేశ్ (మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌)ను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తదితరులు సన్మానించి, అభినందించారు.