నిజామాబాద్‌‌ రూరల్‌‌ తహసీల్దార్‌‌ ఆత్మహత్య

నిజామాబాద్‌‌ రూరల్‌‌ తహసీల్దార్‌‌ ఆత్మహత్య

నిజామాబాద్, నిజామాబాద్ టౌన్, వెలుగునిజామాబాద్‌‌ రూరల్‌‌ తహసీల్దార్‌‌ జ్వాల గిరిధర్​రావు(54) బుధవార అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో తీవ్ర విషాదం నింపింది. నల్గొండ జిల్లా రామగిరికి చెందిన ఆయన గతంలో హైదరాబాద్‌‌లో తహసీల్దార్‌‌గా పని చేశారు. గతేడాది ఎన్నికల టైమ్‌‌లో నిజామాబాద్‌‌ రూరల్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. తనను తిరిగి హైదరాబాద్‌‌కు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆయన చాలా సార్లు విన్నవించుకున్నారు. ఆరు నెలల కోసం ఇక్కడి పంపించి ఎన్నికలు ముగిసి, ఏడాది అవుతున్నా మళ్లీ ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయకపోవడంపై కొన్ని నెలలుగా మనస్తాపంతో ఉన్నారు. అలాగే కుటుంబానికి దూరంగా ఉడడానికి తోడు పని ఒత్తిడి కూడా పెరిగిందని తరచు చెప్పేవాడని స్నేహితులు చెబుతున్నారు.

గిరిధర్​రావు నిజామాబాద్‌‌లోని నాగోల్‌‌ టౌన్‌‌ ఆర్యనగర్‌‌లో ఉంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌‌లో ఉంటున్న భార్యతో చాలా సేపు ఫోన్‌‌లో మాట్లాడారు. ఉదయం భార్య పలుసార్లు ఫోన్‌‌ చేసినా ఎత్తకపోవడంతో ఆందోళనకుగురైన ఆమె డ్రైవర్‌‌కు కాల్‌‌ చేసి ఇంటికి వెళ్లమంది. అతను వచ్చి పలుసార్లు డోర్‌‌ కొట్టి, ఫోన్‌‌ చేసినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి డోర్లు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా బెడ్​రూమ్‌‌లో ఫ్యాన్​కు ఉరివేసికొని కనిపించాడు. ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మహత్య విషయం తెలిపారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లి పోస్ట్‌‌మార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు అమెరికాలో ఉండగా, చిన్న కొడుకు ఐఐటీలో చదువుతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌‌ కలెక్టర్​ ఎం. రామ్మోహన్​రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ గిరిధర్​రావు మృతదేహనికి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఒదార్చురు.

రెవెన్యూ ఉద్యోగులు నిరసన ర్యాలీ..

ఎన్నికల డ్యూటీలో వచ్చిన గిరిధర్​రావును తిరిగి ట్రాన్స్‌‌ఫర్‌‌పై చేయకపోవడంతోనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుసాగర్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఈ ఘటనతో అయినా కనువిప్పు కలగాలన్నారు. మృతదేహంతో దవాఖానా నుంచి కలెక్టరేట్ వరకు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని ర్యాలీ నిర్వహించారు.

ఆత్మహత్య బాధాకరం- డిప్యూటీ క‌‌లెక్టర్ల సంఘం

నిజామాబాద్ జిల్లా రూర‌‌ల్ త‌‌హసీల్దార్‌‌ ఆత్మహత్యకు పాల్పడడం దురదృష్టకరమని డిప్యూటీ క‌‌లెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ల‌‌చ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌‌ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెవెన్యూ శాఖ‌‌లో ఇలాంటి సంఘ‌‌ట‌‌న‌‌లు చోటు చేసుకోవ‌‌డం.అందరిని కలిచివేస్తోందన్నారు. భవిష్యత్‌ లోఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, తహసీల్దార్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.