
ప్రాజెక్టు కెపాసిటీ 17.8 టీఎంసీలు ఇప్పుడున్నది 0.8 టీఎంసీలు
ఆయకట్టు 2.5 లక్షల ఎకరాలు.. ఆందోళనలో రైతులు
ఎల్లారెడ్డి, వెలుగు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టు కింద సుమారు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే ఆయకట్టంతా పంటలతో పచ్చగా కనిపిస్తుంది. కానీ మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక సింగూరు ప్రాజెక్టులో నీరు చేరకపోవడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో నిజాంసాగర్ నీరు లేక బోసిపోతోంది. ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు సరైన వర్షాలు కురవలేదు. చెరువులు, కుంటలలో సైతం నీరు చేరలేదు. వరదలు లేక ప్రాజెక్టులోకి చుక్క నీరు రాకపోవడంతో ప్రాజెక్టు కింద పంటలు వేయాలో వద్దో తేల్చుకోలేక రైతులు సతమతమవుతున్నారు.
డెడ్ స్టోరేజీకి చేరిన ప్రాజెక్టు
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టులో కొద్దిపాటి నీరున్నా ఒకటవ నంబర్ నుంచి 7వ డిస్ట్రిబ్యూటర్ వరకు లీకేజ్ ద్వారా నీరు వచ్చి పంటలు పండేవి. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మొదటి ఆయకట్టు రైతులకు కాలువ నీరే ఆధారం. చివరి ఆయకట్టు రైతులకు బోరుబావులు, ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. మొదటి ఆయకట్టు రైతులు ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకుని నారుమళ్లు పోసుకున్నారు. కానీ వర్షాలు లేక కొంతమేర మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు.
కాళేశ్వరం నీరు ఎటుపాయే?
నిజాంసాగర్ ప్రాజెక్టును కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నింపి 2.5 లక్షల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చి రైతులను, కాళేశ్వరం నీరు ఎటు పోయిందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిజాంసాగర్ మండలం జక్కపూర్ గ్రామంలో నల్లవాగు ఎత్తిపోతల పథకాన్ని పేపర్ లో మాత్రమే చూపి జుక్కల్ నియోజకవర్గ రైతులను మోసం చేసిందని టీఆర్ఎస్ నాయకులే పేర్కొనడంతో ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.
నారుమళ్లు వేసి ఉంచాం
ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు నింపుతుందని 10 ఎకరాలు కౌలుకు తీసుకొని నారుమళ్లు పోసిన. వర్షాలు కూడా ఈసారి విస్తారంగా లేవు. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నా. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పడం తప్ప ఏం చేస్తలేదు.
– విట్టల్, రైతు, గాలిపూర్
చుక్కనీరు రాలె
కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు నింపి రైతులను రాజు చేస్తామని టీఆర్ఎస్ నాయకులు గత ఎన్నికల్లో చెప్పారు. ఇప్పటికీ ప్రాజెక్టుకు చుక్కనీరు తీసుకురాలేదు. మండలంలో నల్లవాగు ఎత్తిపోతల కోసం నిధులు మంజూరు చేశామని చెప్పి కాగితాలకే పరిమితం చేశారు. రైతుల ఆత్మహత్యలు కప్పిపుచ్చి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. రైతుబంధు పథకాన్ని కొందరికే అందించి గొప్పలు చెప్పుకుంటున్నారు.
సాయిలు, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్, నిజాంసాగర్