
హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విపత్తు కారణంగా భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ( జూలై 4) నాటికి హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 63 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలోని మండీ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. కాంగ్రా, హమీర్‌పూర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్, కులు జిల్లాల్లో కూడా భారీ నష్టం సంభవించింది.
రాష్ట్రంలో పలుచోట్ల క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడటం,ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి అనేక రోడ్లు పూర్తిగా ధ్వంసమై మూసివేశారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అనేక వంతెనలు, రోడ్లు, ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాగునీటి వనరులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 460కి పైగా రోడ్లు మూసివేశారు. ముఖ్యంగా చండీగఢ్-నుంచి మనాలి హైవేలోని మండీనుంచి -మనాలి మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.భారీ వర్షాలు, వరదలతో భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్య పశువులకు చనిపోయాయి.. కొట్టుకుపోయాయి.
రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం (SEOC) నివేదికల ప్రకారం..జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి జూలై 1 వరకు మొత్తం 51 మంది మరణించారు . 22 మంది గల్లంతయ్యారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ,రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు, పోలీసులు ,హోం గార్డులతో కలిసి సహాయక చర్యలు, గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,స్థానిక అధికారుల సూచనలను పాటించాలని హెచ్చరించారు.