హాస్పిటల్స్‌‌ ఆవరణలో కుక్కలు కనిపించొద్దు : ఎన్ఎంసీ

హాస్పిటల్స్‌‌ ఆవరణలో కుక్కలు కనిపించొద్దు : ఎన్ఎంసీ
  •     మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌‌కు ఎన్‌‌ఎంసీ ఆర్డర్స్
  •     నోడల్‌‌ ఆఫీసర్‌‌‌‌ను నియమించి లోపలికి రాకుండా చూడాలని ఆదేశం
  •     సుప్రీం ఆదేశాలతో నేషనల్‌‌ మెడికల్‌‌ కమిషన్‌‌ అలర్ట్‌‌

హైదరాబాద్, వెలుగు: ఆస్పత్రుల ఆవరణలో ఒక్క కుక్క కూడా కనిపించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌‌ను ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కుక్క కాటు కేసులు, హాస్పిటల్స్‌‌లో పేషంట్లపై కుక్కల దాడులు పెరుగుతుండటంతో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌‌ఎంసీ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. 

ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో కుక్కలు చొరబడకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ప్రతి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ చుట్టూ ప్రహరీ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఎక్కడెక్కడ రంధ్రాలున్నాయో, ఎక్కడి నుంచి కుక్కలు లోపలికి వస్తున్నాయో రెండు వారాల్లో గుర్తించి వాటిని మూసేయాలని, గేట్లు ఏర్పాటు చేసి సెక్యూరిటీ టైట్ చేయాలని సూచించింది. ఇందుకు 8 వారాల సమయం ఇచ్చింది.

ఎనీ టైం మెడిసిన్‌‌ స్టాక్‌‌ ఉండాల్సిందే.. 

కుక్కలను కంట్రోల్ చేసేందుకు నోడల్ ఆఫీసర్‌‌‌‌ను నియమించాలని, చెత్తాచెదారం లేకుండా చేయడం, మున్సిపల్ అధికారులతో మాట్లాడి కుక్కలను పట్టుకెళ్లేలా చేయడం అతని పని అని స్పష్టం చేసింది. ఈ ఆఫీసర్ పేరు, ఫోన్ నెంబర్ హాస్పిటల్ బయట పెద్ద బోర్డు మీద రాసి పెట్టాలని, ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఈజీగా ఉండాలని పేర్కొంది. 

హాస్పిటల్ ఆవరణలో మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలని, కుక్కలు గూడు కట్టుకుంటే వెంటనే మున్సిపాలిటీకి చెప్పి వాటిని పట్టుకెళ్లాలని, స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ వేయించి.. వాటిని మరోచోట వదిలేయాలని ఆదేశించింది. ఈ రూల్స్ పాటించకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని ఎన్‌‌ఎంసీ వార్నింగ్ ఇచ్చింది. కుక్కకాటుకు సంబంధించిన మందులు అన్ని ఆస్పత్రుల్లో స్టాక్ ఉంచుకోవాలంది. 

గవర్నమెంట్ ప్రైవేట్‌‌సహా అన్ని హాస్పిటల్స్‌‌లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ ), ఇమ్యునోగ్లోబులిన్(ఆర్ఐజీ) స్టాక్ 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ స్టాక్ మెయింటేన్‌‌ చేయడం ఆస్పత్రుల బాధ్యత అని ఎన్‌‌ఎంసీ గుర్తుచేసింది.