- ఆస్పత్రులకు ఎన్ఎంసీ మార్గదర్శకాలు
- 100% నయం చేస్తామనే అడ్వర్టైజ్ మెంట్లకు చెక్
- చికిత్సకు ముందు.. తర్వాత అని చెప్పినా అంతే
- ప్రకటనల్లో పేషెంట్ రివ్యూలకూ ముకుతాడు
- డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లన్నా అంతేసంగతులు
- నిబంధనలు ఉల్లంఘిస్తే తొలి విడతలో వార్నింగ్
- పదే పదే చేస్తే మూడేండ్ల పాటు లైసెన్సు రద్దు
హైదరాబాద్, వెలుగు: ‘నంబర్ వన్ డాక్టర్..100% గ్యారెంటీ ట్రీట్మెంట్.. నొప్పిలేని ఆపరేషన్’ అంటూ ప్రచారాలు చేసుకునే డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్స్ యాడ్స్ కు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చెక్‌పెట్టింది. వైద్యరంగంలో విచ్చలవిడిగా మారిన వాణిజ్య ధోరణులకు, పేషెంట్లను బురిడీ కొట్టించే తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేసేలా ‘ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు’ సమగ్ర గైడ్ లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రవర్తనా నియమావళి-2002 రూల్స్ ప్రకారం రూపొందించిన ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి తప్పుడు క్లెయిమ్ లు చేస్తే మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్ రద్దు తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
సక్సెస్ సోర్టీలు చెయ్యొద్దు
కొత్త రూల్స్ ప్రకారం.. డాక్టర్లు, హాస్పిటల్స్ తమను తాము నంబర్ వన్ డాక్టర్, బెస్ట్ స్పెషలిస్ట్, 100శాతం సక్సెస్, గ్యారెంటీ క్యూర్, మిరాకిల్ట్రీట్మెంట్ అని చెప్పుకోవడం పూర్తిగా నిషిద్ధం. రోగుల్లో భయం పుట్టించి అనవసర టెస్టులు, సర్జరీలను ప్రోత్సహించే ‘ఫియర్ -బేస్డ్ మార్కెటింగ్’ చేయరాదు. సర్జరీ ఫలితాలను ప్రచారం చేసుకోవడం,పేషెంట్ అనుమతి ఇచ్చినప్పటికీ ఇలాంటి బిఫోర్,- ఆఫ్టర్ ఫొటోలు, సక్సెస్ స్టోరీలను, సోషల్ మీడియాలో పెట్టడం, వాణిజ్య ప్రచారం కోసం వాడడం నేరం. అలాగే సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లతో ప్రమోషన్లు చేయించరాదు. డాక్టర్లు తమ పేరు, సంతకం, ఫొటోలతో ఎలాంటి మందులు, పరికరాలు, హెల్త్ ప్రొడక్టులను ఎండార్స్ చేయకూడదు. లెటర్ హెడ్ లు, క్లినిక్ సైన్ బోర్డులపై డాక్టర్ల పర్సనల్ ఫొటోలు వేయడాన్ని కూడా అనైతిక చర్యగా పేర్కొన్నారు.
ఉచిత టెస్టుల ప్రచారమూ నేరమే
పేషంట్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు, కూపన్లు, గిఫ్ట్ లు, ఫ్రీ టెస్టులు ప్రకటించడం నేరం. ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన రేటింగ్ లు, ఫేక్ రివ్యూలు, ఫేక్ ఫాలోవర్లతో ప్రచారం చేయకూడదు. పేషెంట్ల డీప్ ఫేక్ ఫొటోలు, సింథటిక్ వాయిస్ లు వాడరాదు. అనుమతించిన పరిధిలో ఏఐని వాడితే తప్పనిసరిగా ‘ఏఐ జనరేటెడ్’ అని వాటర్ మార్క్ వేయాలి. లైవ్ సర్జరీలను ప్రసారం చేయొద్దు. హెల్త్ కేర్ అగ్రిగేటర్ ప్లాట్ ఫామ్ లలో డబ్బులు చెల్లించి డాక్టర్లకు ర్యాంకింగ్ లు వేయించరాదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు డాక్టర్ పేరు, విద్యార్హతలతో పాటు స్టేట్ లేదా ఎన్‌ఎంసీ రిజిస్ట్రేషన్ నంబర్ ను తప్పనిసరిగా డిస్ ప్లే చేయాలి.
రూల్స్ బ్రేక్ చేస్తే సస్పెన్షన్
డాక్టర్లు ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు, క్లినిక్ అడ్రస్ మారినప్పుడు, కన్సల్టేషన్ ఫీజుల వివరాలను తెలియజేసేందుకు మాత్రమే సాధారణ పద్ధతిలో యాడ్స్ పేషంట్ల సమాచారం కోసం బోర్డులు, వెబ్ సైట్లలో ప్రదర్శించాలి. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ కఠిన చర్యలు తీసుకుంటాయి. ఫస్ట్ టైం తప్పు చేస్తే వార్నింగ్ ఇచ్చి ఎథిక్స్ ట్రైనింగ్, రెండోసారి మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. మూడోసారి బ్రేక్ చేస్తే.. 3 నుంచి 6 నెలల పాటు రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేస్తారు. తప్పుడు క్లెయిమ్ లు, భారీ డిజిటల్ ప్రచారాలతో రోగులను ప్రలోభపెట్టడం వంటి తీవ్ర ఉల్లంఘనలకు 6 నుంచి 12 నెలల సస్పెన్షన్ విధిస్తారు. పదేపదే రూల్స్ బ్రేక్చేస్తే ఒకటి నుంచి 3 ఏండ్ల దాకా లైసెన్స్ రద్దు చేస్తారు. చర్యలకు ముందు షోకాజ్ నోటీసు ఇస్తారు. ఎస్‌ఎంసీ నిర్ణయంపై 60 రోజుల్లోగా ఎన్‌ఎంసీకి అప్పీల్ చేసుకునే చాన్స్ ఉంటుంది. హాస్పిటల్స్ పై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్డ్ ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.
