తమిళనాడు: సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా.. లేదా..? అన్న అంశం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పిస్తే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని మిత్రపక్షాలైన సీపీఎం, వీసీకే టీవీకేను హెచ్చరించాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు అంశంపై అధికార టీవీకే అధిష్టానం క్లారిటీ ఇచ్చింది.
ఈ మేరకు టీవీకే కీలక నేత, మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించబోమని తేల్చిచెప్పారు. విజయ్ కేబినెట్లో అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. టీవీకే నేతృత్వంలోని కూటమి చెక్కుచెదరలేదని, సీఎం విజయ్ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతారని తెలిపారు.
కేబినెట్ ఒకే కుటుంబంలా పనిచేయాలని సీఎం విజయ్ కోరుకుంటున్నారని.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పార్టీలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం ఉండాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించాయని.. ఈ క్రమంలో రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఒకతాటిపైకి వచ్చి టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని తెలిపారు.
అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎవరంటే..?
ALSO READ : కేరళ మంత్రులకు శాఖల కేటాయింపు..
2026 తమిళనాడు అసెంబ్లీకల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 మంది స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ టీవీకే సాధించలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు ఇతర పక్షాల మద్దతు అవసరమైంది. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకేలోని షణ్ముగం వర్గం డిమాండ్ చేసింది. ఇందుకు పార్టీ చీఫ్ పళనిస్వామి వర్గం అంగీకరించలేదు. దీంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది.
షణ్ముగం వర్గం విజయ్‌కు మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించింది. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలోనూ షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారు. దీంతో విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా గట్టెక్కింది. విజయ్ కు సపోర్ట్ చేసిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మె్ల్యేలకు మంత్రి పదవులు ఇవ్వబోమని టీవీకే స్పష్టం చేసింది.
