
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తుల కసరత్తు వేగంగా జరుగుతోంది. మొన్నటికి మొన్న ఏపీలో టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో తెలంగాణలోనూ జనసేనతో పొత్తు ఉండే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు భావించారు. తాజాగా తెలంగాణలో టీడీపీతో పొత్తు పరిస్థితులు కనిపించడం లేదు.
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీతో జనసేన చర్చలు జోరందుకున్నాయి. ఏ క్షణమైనా జనసేన, బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీలో పొత్తున్నా ఇక్కడ టీడీపీతో ములాఖత్ అయ్యే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. దీంతో తెలంగాణలో టీడీపీ, జనసేన పొత్తు ఉన్నట్లా లేనట్టా అంటే దాదాపు లేనట్లే అని స్పష్టమవుతోంది.
బీజేపీతో జనసేన సీట్ షేరింగ్..
రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ నేతల చర్చిస్తున్నారు. కనీసం 20 సీట్లలో జనసేన పోటీ చేస్తామని బీజేపీని కోరింది. అయితే బీజేపీ 6 నుంచి 10 సీట్లను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.