
‘మృగశిర కార్తె’.. అనగానే గుర్తుకొచ్చేది బత్తిని సోదరుల చేప మందు !! 178 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా దాని పంపిణీ జరుగుతోంది. ఈ ఏడాది కూడా జూన్ 8న మృగశిర కార్తె రాబోతోంది. కానీ బత్తిని సోదరుల చేపమందు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. కొవిడ్ కారణంగా అంతకుముందు రెండేళ్లు కూడా చేపమందు పంపిణీ జరగలేదు. ఈసారి కూడా కరోనా ఎఫెక్ట్ తో దాన్ని అందించడం లేదు. అయినా చేపమందు కోసం తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఎంతోమంది వచ్చారు. ఈసారి మృగశిర కార్తెకు చేపమందు వేస్తారనే ఆశతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇంకొంత మంది నేరుగా బత్తిని సోదరుల ఇల్లు ఉండే దూద్ బౌలి ఏరియాకు వెళ్తున్నారు. చేపమందు ఎందుకు వేయడం లేదంటూ బత్తిని సోదరులను వారు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ‘వీ6’ న్యూస్ క్షేత్ర స్థాయి పరిశీలనలో ఈవిషయాలు వెలుగులోకి వచ్చాయి.
చేపమందు వేయట్లేదనే చెప్పి..
‘కరోనా కారణంగా ఈ ఏడాది కూడా చేపమందును పంపిణీ చేయడం లేదు’ అనే సందేశంతో కూడిన ఫ్లెక్సీని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వద్ద ఏర్పాటుచేశారు. చేపమందు వేయించుకుందామని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లంతా ఆ ఫ్లెక్సీ వద్ద కూర్చున్నారు. రోజుల తరబడి రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి చేపమందు కోసం హైదరాబాద్ కు వచ్చామని వారు తెలిపారు. తీరా ఈ ఫ్లెక్సీని చూసి తీవ్ర నిరాశకు గురయ్యామని చెప్పారు. ఉబ్బసం, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి చేపమందు బాగా పనిచేస్తుందని కొనియాడారు. జూన్ 8వ తేదీన ఉదయం వరకు ఎదురుచూసి తిరిగి తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామని పలువురు చెప్పారు. అనంతరం దూద్ బౌలి ఏరియాలోని బత్తిని సోదరుల ఇంటిని కూడా ‘వీ6’ న్యూస్ సందర్శించింది. ఆ ఇంటి పరిసరాల్లోనూ ఎంతోమంది చేపమందు ఎదురుచూస్తూ కనిపించారు. ఈ ఏడాది చేపమందు వేయట్లేదనే విషయాన్ని వాళ్లకు చెప్పి పంపించేస్తున్నారు.
గతంలోకి వెళితే..
ఒక్కసారి గతంలోకి వెళితే.. చేపమందు కోసం అరబ్ దేశాలు, ఐరోపా దేశాల నుంచి కూడా జనం పెద్దసంఖ్యలో కొన్ని రోజుల ముందే వచ్చేవారు. వారి రాకతో హైదరాబాద్ లో ఆతిథ్య రంగం రెక్కలు తొడిగేది. హోటళ్లు కూడా సందడిగా మారేవి. చేపమందు తీసుకునేందుకు వచ్చే వారి కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగేవి. జనసందోహం సౌకర్యార్ధం షామియానాలు, తాగునీటి ఏర్పాట్లు జరిగేవి. ఇందులో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనేవి. క్యూ లైన్ల కట్టడికి బారికేడ్లు ఏర్పాటు చేసేవారు. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించి.. తనిఖీ చేసిన తర్వాతే ప్రజలను లోపలికి అనుమతించేవారు. సీసీ కెమెరాలతో క్యూ లైన్లను నిత్యం పర్యవేక్షించేవారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించేవారు. చేపమందు పంపిణీ కార్యక్రమం వల్ల పరిసరాల ప్రాంతాల చిరువ్యాపారులు, లాడ్జీల నిర్వాహకులకు కూడా మంచి వ్యాపారం జరిగేది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే 40 నుంచి 50 కౌంటర్ల ద్వారా దాదాపు 1.50 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసేవారు. ఇందుకు అవసరమైన చేప పిల్లలను రాష్ట్ర మత్స్యశాఖ నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి సేకరించి అందించేది.
బెల్లం ప్రసాదం, కార్తె ప్రసాదం ఇస్తున్నాం
‘‘ 1845 నుంచి మా కుటుంబం వాళ్లు ఏటా మృగశిర కార్తెకు చేపమందు వేస్తున్నారు. 1998 వరకు చేపమందు కోసం మా ఇంటికి ఏటా 2 లక్షల మంది వచ్చేవాళ్లు. ఆ తర్వాతే నాంపల్లి నుమాయిష్ గ్రౌండ్ కు ప్రసాదం పంపిణీని మార్చాం.కొవిడ్ ఉందా ? లేదా ? అనే గందరగోళంలో ఈ ఏడాది కూడా ప్రసాదం పంపిణీకి బ్రేక్ వేశాం. ఈ సంవత్సరం చేప ప్రసాదం కోసం ఎవరూ రావద్దని ఇప్పటికే మీడియా ద్వారా వెల్లడించాం. ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర బ్యానర్ కూడా కట్టాం. చేపమందు వేసే క్రమంలో.. ఒకరి నోట్లో నుంచి మరొకరి నోట్లోకి చేయి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కొవిడ్ నేపథ్యంలో ఈసారి కూడా చేపమందు వేయట్లేదు. ఎంతో ఆశించి మా ఇంటికి వచ్చేవాళ్లను ఖాళీగా పంపకుండా.. బెల్లం ప్రసాదం, కార్తె ప్రసాదం ఇస్తున్నాం’’
- బత్తిని గౌరీశంకర్