హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్అధికారులకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావుకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. వాళ్లిద్దరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. మరో ఇద్దరు నిందితులు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు ఇప్పటికే పలుమార్లు డిస్మిస్ అయ్యాయి. ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్స్‌పై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
రెడ్‌కార్నర్ నోటీసులతోనే ఇద్దరి అరెస్టు
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడు ఐ న్యూస్ ఎండీ శ్రవణ్‌కుమార్ ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరిద్దరిపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్స్ జారీ అయిన సంగతి తెలిసిందే. జూన్ 26న ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా క్యాన్సర్, గుండె సంబంధ అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నట్లు ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ చార్జ్‌షీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించాక వీరిద్దరిపై రెడ్‌కార్నర్ నోటీసులకు పోలీసులు ప్రపోజల్స్ పంపించారు. ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన అంశం సీబీఐ వద్ద పెండింగ్‌లో ఉంది. రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయితే తప్ప ప్రభాకర్ రావు, శ్రవణ్‌కుమార్ రావును ఇండియాకు రప్పించే అవకాశాలు లేవు. దీంతో రెడ్‌కార్నర్ నోటీసుల ప్రాసెస్‌ను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
