ఏడాది కావస్తున్నా ఎకరానికీ నీళ్లు రాలే!

ఏడాది కావస్తున్నా ఎకరానికీ నీళ్లు రాలే!

పెద్దపల్లి, వెలుగు: 2019 జూన్​ 22.. కాళేశ్వరం ప్రాజెక్ట్​ ప్రారంభించిన రోజు. లింక్​–1లో 30 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్న సర్కార్​ మాటలు నీటి మూటలే అయ్యాయి. ప్రాజెక్ట్​ ప్రారంభమై ఏడాది సమీపిస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఎకరానికీ నీళ్లియ్యలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణాన్ని 7 లింకులు,  28 ప్యాకేజీలతో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో లింక్​–1లో  గోదావరి నీటిని జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ నుంచి పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి వరకు తరలిస్తారు. లింక్​–1లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల, గోలివాడలలో మూడు పంప్​హౌస్​లు నిర్మించారు. మూడు బ్యారేజీలతో 35.87 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు. లింక్​–1లో 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని అందిస్తామని, దీంతోపాటు పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి రైతులకు సైతం ఎత్తిపోతలు ప్రారంభించి నీళ్లు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్ట్​ ప్రారంభించి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో కొత్త ఆయకట్టుకు ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. పాత ఆయకట్టు స్థిరీకరణ కాలేదు.

పూర్తికాని ఎత్తిపోతలు

కాళేశ్వరం ప్రాజెక్ట్​కు సమానంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్​పూర్​మండలంలో ప్రారంభమైన చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు నేటికి పూర్తికాలేదు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్​ ద్వారా  మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని ప్రభుత్వం హామీలు గుప్పించింది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​ వాటర్ ను ఎత్తిపోస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్​ పనులు పూర్తి చేయకపోవడంతోమంథని నియోజకవర్గం నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్​కు భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోసి పెద్దపల్లిలోని రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మండలాల్లోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో 2018 ఫిబ్రవరిలో కేసీఆర్​రామగుండం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు దాటినా నేటికి రామగుండం ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు. ఆయకట్టుకు నీళ్లు రాలేదు. ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్​ మండలంలోని ఆయకట్టుకు నీటిని అందించడానికి మేడారం రిజర్వాయర్​ నుంచి చేపట్టిన కొత్త ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగడం లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్​తో ముడిపడిన పలు ఎత్తిపోతల పథకాలు పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో ముందుకు సాగకపోవడంతో నాలుగు జిల్లాల రైతులకు కాళేశ్వరం నీళ్లు కలగానే మారే పరిస్థితి కనిపిస్తున్నది.

భూములిచ్చిన రైతులకే నీళ్లు కరువు

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో భాగంగా లింక్​ –1లో నిర్మించిన బ్యారేజీలు, పంప్​హౌజ్​లు, సబ్​స్టేషన్లు, అండర్​టన్నెళ్లు, గ్రావిటి కాలువల కోసం రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారు. ప్రాజెక్ట్​ నిర్మాణం పూర్తయితే తమకు నీళ్లు వచ్చి తమ బతుకులు బాగుపడతాయని భావించారు. ఏడాది కావస్తున్నా నీళ్లు రాకపోవడంతో భూములిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాక్ డౌన్ ముగిసినంక సింగరేణిలో ఎన్నికలు