బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు లేదు..పార్టీ రాష్ట్ర నేతలకు హైకమాండ్ సంకేతాలు

బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు లేదు..పార్టీ రాష్ట్ర నేతలకు హైకమాండ్ సంకేతాలు
  • పార్లమెంట్ ఎన్నికల వరకూ కిషన్ రెడ్డి కొనసాగింపు 
  • పార్టీ రాష్ట్ర నేతలకు హైకమాండ్ సంకేతాలు  

హైదరాబాద్, వెలుగు:  పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డినే కొనసాగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర నేతల్లో చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరులో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందని బీజేపీ ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున ఇంత తక్కువ వ్యవధిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చితే ఎలక్షన్ లో నష్టపోతామని హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకే అధ్యక్షుడిగా కొనసాగుతానని కిషన్ రెడ్డి హైకమాండ్ కు ముందే చెప్పినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్నే కొనసాగించాలని బీజేపీ అగ్ర నేతలు నిర్ణయానికి వచ్చినట్లుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకున్న ఢిల్లీ పెద్దలు, పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉండగా, రాబోయే ఎన్నికల్లో ఆ సంఖ్యను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కంటిన్యూ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ముఖ్య నేత ఒకరు చెప్పారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు చెప్తున్నారు. 

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని జనం నమ్మారు.. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ హైకమాండ్ కు కిషన్ రెడ్డి మూడ్రోజుల క్రితమే నివేదిక అందజేసినట్లు తెలిసింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని జనం నమ్మడంతోనే అనుకున్న ఫలితాలు రాలేదని ఆయన తెలియజేసినట్లు సమాచారం. అయితే, 2018తో పోలిస్తే ఓట్లు, సీట్ల సంఖ్యను బాగానే పెంచుకున్నట్టు అందులో పేర్కొన్నారు. బీసీ సీఎం ప్రకటన, ఎస్సీ వర్గీకరణ హామీలపై కూడా జనం నుంచి సరైన స్పందన రాలేదని తెలిపినట్లు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయబోమని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వేస్తామని కొన్ని చోట్ల అభ్యర్థులతో జనం అన్నట్లు కూడా నివేదికలో కిషన్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.