హాల్ట్ స్టేషన్‌‌పై నో క్లారిటీ!

హాల్ట్ స్టేషన్‌‌పై నో క్లారిటీ!

సిద్దిపేట, వెలుగు:  కొమురవెల్లి వద్ద రైల్వే హాల్ట్ స్టేషన్ ఏర్పాటుపై రైల్వే అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు.  రైల్వే లైన్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకోగా.. ఈ నెలాఖరులోగా ట్రయల్ రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.  మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కొమురవెల్లి వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు చాలాకాలంగా కోరుతున్నారు.  కానీ, రెండేళ్ల కింద విడుదలైన రైల్వే స్టేషన్ జాబితాలో కొమురవెల్లి పేరు లేదు. దీంతో ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు భూసేకరణ కూడా చేశారు.  రైల్వే ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ రంగనాథ్ ప్రత్యేకంగా ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. 

టెక్నికల్ అథారిటీ నిర్ణయం కోసం వెయిటింగ్

రైల్వే నిబంధనల ప్రకారం కొమురవెల్లి రైల్వే లైన్ స్కిప్పర్ గ్రేడ్‌‌లోకి వస్తుండంతో హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేసే విషయంపై రైల్వే అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు.  రైల్వే లైన్ లెవల్ గ్రేడ్ ప్రకారం ఒక రైల్వే ట్రాక్ 150 మీటర్లు సాగిన తర్వాత ఒక మీటర్ అప్ , డౌన్ లేదా లెవల్‌‌గా ఉండాలి.  150 మీటర్ల లోపల లెవల్స్‌‌లో తేడా ఉంటే స్కిప్పర్ గ్రేడ్‌‌గా భావించి రైళ్లను నిలిపేందుకు అనుమతి ఇవ్వరు. హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రదేశం స్కిప్పర్ గ్రేడ్‌‌లో ఉండడంతో టెక్నికల్ అథారిటీ నిర్ణయమే ఫైనల్‌‌గా మారనున్నది. స్పెషల్ సేఫ్టీ మెజెర్స్‌‌తో హాల్ట్ స్టేషన్‌‌కు పర్మిషన్‌‌ ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ మేరకు పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.  

31న ట్రయల్ రన్‌‌ 

మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి రైల్వే లైన్ లో భాగంగా కొడకండ్ల నుంచి దుద్దెడ వరకు 30 కిలో మీటర్ల మేర ట్రాక్ పనులు పూర్తవడంతో ఈ నెల 31న ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.  అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 13 మీటర్ల  పొడవు పట్టాలు ఏర్పాటు చేసి.. పది రోజుల కింద ప్రత్యేక గూడ్స్ బండిలో 230 మీటర్ల పొడవైన పట్టాలను తెప్పించారు.  ప్రస్తుతం వీటిని బిగించే పనుల్లో ఉన్నారు. రాజీవ్ రహదారినుంచి కొమురవెల్లికి వెళ్లే రెండు రోడ్లలో తిమ్మారెడ్డిపల్లి వద్ద రోడ్డును క్లోజ్ చేసి పనులు నిర్వహిస్తున్నారు. కొండపాక నుంచి వెళ్లే రోడ్డులో  రైల్వే  గేట్‌‌తో పాటు గార్డు రూమ్  నిర్మాణం పూర్తయింది. ఈ గేటుకు సమీపంలోనే హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు  రైల్వే లైన్ కు ఇరువైపులా 25 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఫ్లాట్ ఫామ్ నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్డుకు భూమిని సేకరించారు.  
 భక్తులకు దూరం తగ్గుతుంది..  కొమురవెల్లి మల్లన్న దర్శనానికి  ఏటా లక్షల సంఖ్య లో భక్తులు వస్తుంటారు. రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన లకుడారం నుంచి  రావాలంటే 12 కిలో మీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించాల్సి ఉంటోంది. ప్రస్తుతం హాల్ట్‌‌ స్టేషన్‌‌ కోసం గుర్తించిన స్థలం కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఏర్పాటైన  రాకపోకలకు ఈజీ అవుతుంది. 

అధికారుల పరిశీలనలో ఉంది


కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటు గురించి ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.  ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నా లైన్‌‌ స్కిప్పర్ గ్రేడ్‌‌లో లైన్ ఉండడం ఇబ్బందిగా మారుతోంది.  సమస్యను టెక్నికల్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లినం.  వారు నిర్ణయం తీసుకున్న తర్వాత తుది ప్రకటన వెలువడుతుంది.  

- జనార్దన్, రైల్వే ఇంజనీర్