చుక్ చుక్.. గప్ చుప్.. రైళ్లు రాలేదు.. బొగ్గు పోలేదు

చుక్ చుక్.. గప్ చుప్.. రైళ్లు రాలేదు.. బొగ్గు పోలేదు

నిలిచిన సింగరేణి బొగ్గురవాణా
రూ.400 కోట్ల ఆందాని కోల్పోయిన రైల్వేశాఖ

మందమర్రి/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు లేక సింగరేణిలో బొగ్గు రవాణా నిలిచిపోయింది. దీంతో ఓ వైపు రైల్వే వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండగా.. మరోవైపు రైళ్లపై పరోక్షంగా ఆధారపడ్డ వందల మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఢిల్లీ, చైన్నై రైల్వే బ్రాడ్గేజ్ మార్గంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మంచిర్యాల, రవీంద్రఖని(రామకృష్ణా పూర్), మందమర్రి, బెల్లంపల్లి, రేచిన్ రోడ్, రేపల్లెవాడ, రాళ్లపేట, కాగజ్ నగర్, సిర్పూర్(టి) రైల్వే స్టేషన్లున్నాయి. మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, శ్రీరాంపూర్, కాసిపేట, బెల్లంపల్లి, గోలేటితో పాటు ఇతర ప్రాంతాల్లోని బొగ్గు గనులు, అక్కడి ప్రజల వల్ల రైల్వేశాఖ ఏటా వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కరోనాకు ముందు నిత్యం సుమారు 25 వేల మంది రైళ్లద్వారా సికింద్రాబాద్, వరంగల్, జమ్మికుంట, విజయవాడ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు. ఇందులో సింగరేణి ప్రాంత ప్రజలే ఎక్కువ. మహారాష్ట్రలోని బల్లార్ షా, నాగపూర్, అజ్నీతదితర ప్రాంతాలకు చెందిన కూలీలు ప్యాసింజర్ రైళ్ల ద్వారా హైదరాబాద్, వరంగల్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వచ్చి పనులు చేసుకొని తిరిగి వెళ్తుంటారు. రెండు జిల్లాల్లో పది ప్యాసింజర్లు రైళ్లు, 12 ఎక్స్ప్రెస్ రైళ్లు, 30 సూపర్ఫాస్ట్(వీక్లి, వీక్లిస్పెషల్ ట్రైన్లు కలిపి) ట్రైన్లకు హాల్టింగ్స్ ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి పూర్తిగా రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా దేశవ్యాప్తంగా వంద రైళ్లు మాత్రమే నడుస్తుండగా మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ స్టేషన్ల మీదుగా తెలంగాణ, దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రమే హాల్టింగ్ కల్పించారు. కరోనా రూల్స్ పాటిస్తూ రిజర్వేషన్ బోగిల్లో టికెట్ కన్ఫర్మ్ అయ్యాకే మూడు స్టేషన్లలోకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు. మిగిలిన స్టేషన్లలో నాలుగునెలలుగా ఒక్క ట్రైన్ ఆగలేదు.

ఆదాయం కోల్పోతున్న రైల్వే
సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల నుంచి నిత్యం 42 రేక్ల బొగ్గును రవాణా చేసి రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వే శాఖ పొందుతోంది. కరోనా ప్రభావంతో రైళ రాకపోకలు లేక బొగ్గు రవాణా నిలిచిపోయింది. సాధారణంగా మంచిర్యాల నుంచి 5, మందమర్రి నుంచి 5, రేచీన్ రోడ్ నుంచి 4 రేక్ల బొగ్గును రోజూ రాయచూర్, పర్లీ, చంద్రాపూర్, బల్లార్ షా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని సింహాద్రి తదితర పవర్ స్టేషన్లకు తరలిస్తుంటారు. ఒక రేక్ బొగ్గు రవాణా వల్ల రైల్వే శాఖ సుమారు రూ.25 లక్షల ఆదాయం పొందుతుంది. లాక్డౌన్ తో ఫ్యాక్టరీలు మూతపడటం, బొగ్గు గనులకు లే ఆఫ్
ప్రకటించడం, బొగ్గుకు డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో రైళ్లన్నీ పట్టాలకే పరిమితమవుతున్నాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ రెండు జిల్లాల నుంచి గత నాలుగు నెలలుగా రోజుకు కనీసం 3 నుంచి 4 రేక్ల బొగ్గు కూడా రవాణా జరగని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో రైల్వే శాఖ సుమారు రూ.400 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.

పడిపోయిన బొగ్గు ఉత్పత్తి.. 4 నెలల్లో సాధించింది 58 శాతమే..
సింగరేణి కాలరీస్ కంపెనీని కరోనా టెన్షన్ పెట్టిస్తోంది. కరోనా దెబ్బకు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా బొగ్గు ఉత్పత్తి పడిపోయింది. ఏప్రిల్ నుంచి జులై వరకు నిర్ధేశించిన లక్ష్యంలో కేవలం 58 శాతమే కంపెనీలో బొగ్గు ఉత్పత్తి అయింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో కేవలం ఆర్–3జీ ఏరియా మాత్రమే నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వందశాతం బొగ్గు ఉత్పత్తిని సాధించి కరోనా టైంలో రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి కరోనా లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ నుంచి వెసులుబాటు లభించిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ఊపందుకుంటున్న క్రమంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కార్మికులు డ్యూటీలకు వచ్చేందుకు భయపడ్తున్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది. ఇదే పరిస్థితి మరో రెండు నెలలు కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించటం గగనమేనని అధికారులు పేర్కొంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఏప్రిల్నుంచి జులై వరకు 2,13,71,200 టన్నుల లక్ష్యానికి 1,23,53,921 టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు.

ఓపెన్ కాస్ట్ లోనూ అదే పరిస్థితి
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నఓపెన్ కాస్ట్ లలోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల కాలంలో 1,87,68,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా 1,12,72,838 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశాయి. ఇదే క్రమంలో అండర్ గ్రౌండ్ మైన్ల ద్వారా నాలుగు నెలల కాలంలో 26,03,200 టన్నుల లక్ష్యానికి 10,81,083 టన్నుల బొగ్గు ఉత్పత్తితో సరిపెట్టుకున్నాయి.

ఆగిన బతుకుబండి
రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రైలుప్రయాణికులపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 500 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. రైల్వే స్టేషన్లు , పరిసరాల ప్రాంతాల్లో నడిపే హోటళ్లు, బేకరీలు, కిరాణషాప్లు, కూల్డ్రింక్స్, మొబైల్, చెప్పులు, బట్టలు, ఇతర చిరు వ్యాపారులు, బడా వ్యాపారులకు రోజువారి గిరాకీ లేకుండాపోయింది.

For More News..

డేంజర్లో మంజీర బ్రిడ్జీ.. అధిక లోడ్ తో వెళ్తే ఊగుతున్న బ్రిడ్జీ..

కరెంట్ షాకుతో రైతు దంపతుల మృతి