‘పాలమూరు’కు పర్మిషన్లివ్వాల్సిందే.. వివాదాలు తేలేదాకా ఏపీ వాళ్లకు చుక్క నీళ్లివ్వొద్దు

‘పాలమూరు’కు పర్మిషన్లివ్వాల్సిందే.. వివాదాలు తేలేదాకా ఏపీ వాళ్లకు చుక్క నీళ్లివ్వొద్దు
  • ఏపీ ప్రాజెక్టులను ఆపాల్సిందే..‌‌కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీ అల్టిమేటం
  • పాలమూరుకు సత్వర అనుమతులు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాగునీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర శాసనసభ స్పష్టం చేసింది. కరువు కోరల్లో చిక్కుకున్న పాలమూరు ప్రాంతానికి జీవధార అయిన 'పాలమూరు–-రంగారెడ్డి' ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, అదే సమయంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రా చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు బ్రేకులు వేయాలని డిమాండ్ చేస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కరువు, వలసలతో అల్లాడుతున్నా.. గత పదేళ్లలో పాలమూరు–-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదని పేర్కొంది. ఈ జాప్యం వల్లే ప్రాజెక్టు అంచనా వ్యయాలు తడిసి మోపెడయ్యాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి, 90 టీఎంసీల (తాగు, సాగు నీటి కోసం) సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను యుద్ధప్రాతిపదికన మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ ప్రాజెక్టులకు చెక్..
అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కారం కాకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతోందని అసెంబ్లీ తీర్మానంలో పేర్కొంది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు గానీ, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు లేదా మరే ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం తక్షణం అడ్డుకోవాలని కోరింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొలిక్కి వచ్చే వరకు ఏపీకి ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.