ఘట్ కేసర్, వెలుగు: ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. గత నెల 16న బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ పై సొంత పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు మేడ్చల్ కలెక్టర్ కు అవిశ్వాసం నోటీసు అందజేశారు. మున్సిపల్ ఆఫీసులో బుధవారం ఉదయం కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం జరిగింది. చైర్ పర్సన్ తో పాటు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన వైస్ చైర్మన్ మాధవ రెడ్డి టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇతర పార్టీ కౌన్సిలర్లు హాజరు కాలేదు మధ్యాహ్నం ఒకటి గంట వరకు ఇరువర్గాల కౌన్సిలర్లు హాజరు కాలేదు.
దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. నివేదికను కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కౌన్సిలర్లను ప్రోత్సహించి అవిశ్వాసం పెట్టించారని చైర్ పర్సన్ పావని అంజయ్య యాదవ్ విమర్శలు చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చైర్ పర్సన్ పై తమతో అవిశ్వాసం పెట్టించి, వీగిపోయేలా చేస్తానని చైర్ పర్సన్ కు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో పాటు అవిశ్వాసం నోటీసులో సంతకాలు చేసిన కొందరు కౌన్సిలర్లు చైర్ పర్సన్ వెంట క్యాంపునకు తరలించి అవమానపరిచారని పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇరువర్గాలు పార్టీని వీడేందుకు సిద్ధమవడంతో ఘట్ కేసర్ లో బీఆర్ఎస్ కనుమరుగు కానుంది.
