NDAకు రాహుల్ కొత్త నిర్వచనం

NDAకు రాహుల్ కొత్త నిర్వచనం

అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. దీంతో సభా కార్యకలాపాలు జరగడం లేదు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ NDAపై విమర్శలు గుప్పించారు. ఎన్డీయే అనే పదానికి రాహుల్ కొత్త నిర్వచనం చెప్పారు. నో డేటా అవేలబుల్ (No Data Available’ (NDA) govt wants you to believe) అంటూ ట్వీట్ చేశారు. పలు సందర్భాల్లో తమ దగ్గర డేటా లేదని కేంద్రం చెప్పడంపై రాహుల్ సెటైర్స్ వేశారు. ప్రభుత్వం వద్ద డేటానే కాదు.. జవాబుదారీతనం కూడా లేదని కామెంట్స్ చేశారు. 

  • ‘‘ కరోనా కాలంలో ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదు. 
  • నిరసనలో ఏ రైతు మరణించలేదు.
  • ఏ వలసదారుడు నడుచుకుంటూ వెళుతూ మరణించలేదు.
  • మూకుమ్మడిగా హత్యకు గురి కాలేదు. 
  • ఏ జర్నలిస్టును అరెస్టు చేయలేదు’’ అని రాహుల్ వ్యంగ్యంగా తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

ట్వీట్ చివరిలో ..  ‘‘సమాచారం లేదు.. సమాధానాలు లేవు.. జవాబుదారీతనం లేదు ’’ అంటూ వ్యాఖ్యానించారు.  

కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో చాలామంది వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో చాలా మంది కాలి నడకన వెళ్లారు. నడక దారిన వెళుతూ.. ప్రమాదాలకు గురయ్యారు. అంతేగాకుండా.. రెండో వేవ్ సందర్భంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీనిపై తమ వద్ద డేటా లేదని కేంద్రం సమాధానం ఇస్తోందని రాహుల్  మండిపడ్డారు. ఇలా పలు సందర్భాల్లో డేటా లేదని చెప్పడంపై ఆయన సెటైర్స్ వేశారు.