
వాషింగ్టన్: అఫ్గాన్ నుంచి ఎవాక్యువేషన్ ఆపరేషన్లను ఆగస్టు 31 కల్లా ముగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాను తాలిబన్లు హెచ్చరించిన నేపథ్యంలో అగ్రరాజ్యం స్పందించింది. తమకు ఎటువంటి డెడ్‌లైన్లతో సంబంధం లేదని, తమ దేశ పౌరులు, విదేశీయులు,అక్కడి నుంచి బయటపడాలనుకుంటున్న అఫ్గాన్ పౌరులను తరలించేంత వరకూ తమ తరలింపు ఆపరేషన్లు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. అల్ జజీరా మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘‘ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. మా తరలింపు పనులపై ఎటువంటి డెడ్‌లైన్ లేదు. అఫ్గాన్ విడిచి వెళ్లాలనుకునే వాళ్లందరినీ తరలించే వరకూ కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉండి ఆపరేషన్స్ కొనసాగిస్తాం” అని ఆయన తెలిపారు. అమెరికన్స్, ఇతర విదేశీయులు, దేశం విడిచి వెళ్లాలనుకునే అఫ్గాన్ల తరలింపు విషయంలో అడ్డంకులు కలిగించబోమని తాలిబన్లు గతంలో పబ్లిక్‌గా, ప్రైవేట్‌గానూ అనేక సార్లు చెప్పారని బ్లింకెన్ గుర్తు చేశారు. ఆగస్టు 31 తర్వాత కూడా ఇది యథావిధిగా కొనసాగుతుందన్నారు.
బ్లింకెన్‌తో పాటు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జెన్ సకి కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. ఆగస్టు 31 తర్వాత కూడా అఫ్గాన్‌ను విడిచి రావాలనుకునే వారికి తమ కాన్సులేట్ సహకారం అందిస్తుందని ఆమె చెప్పారు. అఫ్గాన్ నుంచి యూఎస్ మిలటరీ వెళ్లిపోయాక కూడా ఆ దేశం నుంచి వెళ్లాలనుకునే వాళ్లకు స్వేచ్ఛ ఉండాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నట్టు తెలిపారు.