ఒక ఒప్పందానికి వచ్చేవరకు ఎలాంటి ఒప్పందం లేదు: రష్యా పై క్లారిటీ ఇచ్చిన ట్రంప్..

ఒక ఒప్పందానికి వచ్చేవరకు ఎలాంటి ఒప్పందం లేదు:  రష్యా పై క్లారిటీ ఇచ్చిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ నిన్న శుక్రవారం అలస్కాలో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలకి సంబంధించి ఏ ఒక్క నిర్ణయం కూడా వెలువడలేదు.

ఈ సమావేశం తరువాత ట్రంప్ ఏదైనా ఒప్పందం కుదిరే వరకు ఎలాంటి ఒప్పందం లేదు అని స్పష్టం చేశారు. దింతో ఈ చర్చల్లో పరిష్కారం దొరకలేదని అర్థం అవుతోంది. పుతిన్ కూడా ఈ చర్చలు ఉపయోగకరమైనవి అని చెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి రష్యాకు నిజమైన ఆసక్తి ఉందని, అయితే రష్యాకు కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా చెప్పారు.

ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పుతిన్ పశ్చిమ దేశాల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల తర్వాత వేల మంది ప్రాణాలు కోల్పోయిన ఈ యుద్ధం గురించి ఇద్దరు నేతలు మాట్లాడారు.  

 మేము చాలా విషయాలపై ఒక అవగాహనకు వచ్చాం. ఇంకొన్ని విషయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక ఒప్పందానికి చేరుకోవడానికి మాకు మంచి అవకాశం ఉంది అని ట్రంప్  అన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని, ఈ సమావేశం  ఉక్రెయిన్‌లో శాంతికి దారి తీస్తుందని పుతిన్ అన్నారు.

గతంలో రష్యా నాటో (NATO)లో ఉక్రెయిన్ చేరకూడదని, మాస్కో స్వాధీనం చేసుకున్న తూర్పు ప్రాంతాలను వదులుకోవాలని కోరింది. అయితే ఉక్రెయిన్ ఈ డిమాండ్లను తిరస్కరించింది. అలాగే భవిష్యత్తులో రష్యా దాడి చేయకుండా ఉండేందుకు శాంతి ఒప్పందంలో భద్రతా హామీలు ఉండాలని ఉక్రెయిన్ తెలిపింది.

అయితే పుతిన్ యుద్ధం పై రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ట్రంప్ బహిరంగంగా విమర్శించినా, పుతిన్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.