డ్రైనేజీలు, మురికి కాల్వలు లేని అందమైన ఊరు

డ్రైనేజీలు, మురికి కాల్వలు లేని అందమైన ఊరు

ఏ ఊరికెళ్లినా మురికి కాల్వలు… డ్రైనేజీలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా చోట్ల భరించలేని వాసన.. ఈగలు, దోమల మోత. పరిశుభ్రత కూడా తక్కువే. కానీ, వెంకంపల్లి అనే ఊరు మాత్రం అలా ఉండదు. ఈ ఊళ్లో ఎక్కడా మురికి కాల్వలు, డ్రైనేజీలు కనిపించవు. ఊరంతా చాలా శుభ్రంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ఈగలు, దోమల బెడదా అంతగా ఉండదు. ఇంత స్వచ్ఛమైన ఊరు ఎక్కడుంది అనుకుంటున్నారా? మన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లి చిన్న పల్లెటూరు. 120 కుటుంబాలు, దాదాపు 750 వరకు జనాభా ఉంది. జనాభా తక్కువే అయినా, చిన్న ఊరే అయినా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది వెంకంపల్లి. ఎందుకంటే ఇక్కడ మురికి కాల్వలు కనిపించవు. రోడ్లపై డ్రైనేజీలు పొంగవు. ఎక్కడా ఈగలు, దోమల మోత ఉండదు. వాడిపారేసే నీళ్లు బయటకు పోకుండా, భూగర్భ జలాలు పెరిగేలా ఇంటికో ఇంకుడు గుంత ఉంటుంది. ఎవరి పరిసరాల్ని వాళ్లు శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒక పెరడు తప్పకుండా ఉంటుంది. ఇంటిచుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. గ్రామస్తులంతా కలిసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని నిరంతరం సాగిస్తున్నారు.

ఊరివాళ్లతోనే..

ఇప్పుడు ఇంత స్వచ్ఛంగా కనిపిస్తున్న వెంకంపల్లి కూడా ఒకప్పుడు అన్ని ఊళ్లలాగే ఉండేది. ఇక్కడ కూడా మోరీలు, డ్రైనేజీలు కామన్‌‌గా ఉండేవి. శుభ్రత చాలా తక్కువ. భరించలేని వాసనతో ఇబ్బంది పడేవాళ్లు. కానీ, ముంబైకు చెందిన స్వాధ్యాయ టీమ్‌‌ రాకతో, ఊరిలో మార్పు మొదలైంది అంటున్నారు గ్రామస్తులు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పాండురంగశాస్త్రి అఠవాలేకు సంబంధించిన స్వాధ్యాయ టీమ్ ముంబై నుంచి వెంకంపల్లికి వచ్చింది. పాండురంగ శాస్త్రి బోధనలు వినిపించేందుకు వచ్చిన స్వాధ్యాయ బృందం మెల్లిగా, గ్రామాభివృద్ధిపై కూడా దృష్టిపెట్టింది. గ్రామ సమస్యలకు పరిష్కారాల్ని సూచించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతోనే మార్పు తెచ్చేందుకు ప్రయత్నించారు. భూగర్భ జలాలను ఎలా పెంచుకోవచ్చో చెప్పారు. ఇంట్లో వాడిన నీళ్లు బయటకు పోకుండా, భూమిలోకి ఇంకే ప్లాన్‌‌ రెడీ చేశారు. రోడ్లపై మురికి నీళ్లు పారకుండా ఉండటం, ఊరిని క్లీన్‌‌గా ఉంచుకోవడం, ఇంటి చుట్టూ పెరడు పెంచుకోవడం వంటివి ఎలా చేయాలో చూపించారు.

అంతా ఒక్కటిగా కలిసి

స్వాధ్యాయ టీమ్‌‌ సహకారంతో ఊరిని బాగు చేసుకునేందుకు ఊళ్లో వాళ్లంతా ఒక్కతాటిపై నిలిచారు. అందరూ కలిసి ఊరిని అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. ప్రతి ఇంటికో ఇంకుడు గుంత తవ్వుకున్నారు. వాడిన నీళ్లు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో మురికి కాల్వలు, డ్రైనేజీలు ఎక్కడా కనిపించవు. ఊళ్లో ఈగలు, దోమల బెడద కూడా ఉండదు. ప్రతి ఇంటి పెరట్లో పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకుంటున్నారు. ఈ పద్ధతుల్ని దాదాపు అందరూ పాటిస్తున్నందువల్ల గ్రామంలో శానిటేషన్‌‌ సమస్య లేదు. ప్రజలకు జ్వరాలు, ఇతర అంటురోగాలు కూడా తక్కువే. వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకేలా చేసుకున్నారు కాబట్టి, భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య కూడా లేదు.

ఎలా చేశారు?

ఇంట్లో వాడిన నీళ్లు భూమిలోకి ఇంకేందుకు చిన్న గుంత తవ్వారు. అక్కడ్నుంచి పైపు ద్వారా నీళ్లు ఇంకుడు గుంతలోకి వెళ్తాయి. ఇంకుడుగుంతలు పైకి  కనిపించకుండా పైనుంచి మట్టితో కప్పేస్తారు. దీంతో మోరీలు పారే అవకాశం లేదు. అలాగే ఇంకుడుగుంతల కోసం పెద్ద గుంత తవ్వి, అడుగున పెద్ద రాళ్లు వేశారు. వాటిపై చిన్న రాళ్లు, గోనె సంచులు వేసి ఇసుక పోశారు. ఆపైన మట్టితో కప్పేశారు. ఇలా వర్షపు నీళ్లు కూడా ఇందులోకి ఇంకుతాయి. ఇరవై ఏళ్ల నుంచి దాదాపు 120 ఇళ్లకు ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకున్నారు. మోరీలు తీయడం వంటి పనులు చేయాల్సిన అవసరం లేకపోవడంతో ఊళ్లో శానిటైజేషన్‌‌ సిబ్బంది కూడా లేరని గ్రామస్తులు అంటున్నారు.

నడి ఊరిలో సంపు

ఊరి మధ్యలో ‘అమృతాలయం’ ఉంది. ఇక్కడే 40వేల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపు కట్టారు. అమృతాలయంపైన, పరిసరాల్లో పడే వర్షపు నీళ్లు సంపులోకి పోయే ఏర్పాటు ఉంది. అవసరాన్ని బట్టి ఇక్కడి నుంచి తమ ఇళ్లకు నీళ్లు తీసుకెళ్తారు.

శానిటేషన్​ ప్రాబ్లమ్స్​ లేవు

మా ఊరిలో మోరీలు లేవు. ఏ ఇంటి నుంచి కూడా మోరీల నీళ్లు బయటకు రావు. అన్ని ఇళ్లలో ఇంకుడుగుంతలు ఉన్నాయి. మోరీలు క్లీన్​ చేస్తలేరని కానీ, రోడ్లపై నీళ్లు పారుతున్నాయని కానీ ప్రాబ్లమ్స్​ లేవు. శానిటేషన్ ​సిబ్బంది లేరు. శానిటేషన్‌‌కు ఖర్చు చేసే పైసల్ని ఊరిలో ఇతర డెవలప్‌‌మెంట్​ పనులు చేసుకోవటానికి అవకాశం కలిగింది.  ఊరి వాళ్లే  ఎవరికివారుగా 20 ఏళ్ల క్రితం నుంచే ఇంకుడు గుంతలు తవ్వుకుంటున్నారు.

– సుభాకర్​రెడ్డి, సర్పంచి, వెంకంపల్లి

వాడికారి గంగాధర్, కామారెడ్డి, వెలుగు

For More News..

బార్డర్ నుంచి బంకర్లు ఖాళీ చేసిన చైనా ఆర్మీ

22.. 50.. వయసు ఎంతైనా అందరికీ ఒకే న్యాయం

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు