కేసీఆర్ బెదిరింపులకు భయపడం : అశ్వత్థామరెడ్డి

కేసీఆర్ బెదిరింపులకు భయపడం : అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ కార్మికులు నా బిడ్డలని సీఎం కేసీఆర్ అనడం సంతోషంగా ఉందని అన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. శుక్రవారం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ..కార్మికులు తన బిడ్డలని చెప్పడంతో తమకు కొత్త సమస్యలు చుట్టుముట్టినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. కార్మికులను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ బెదిరించడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. ఒకరిద్దరు తప్ప….ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరేందుకు  ముందుకు రావడం లేదన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి, వీలైనంత తొందరలో చర్చలు జరపాలని కోరారు. సమ్మె యధావిధిగా కొనసాగుతుందన్న అశ్వత్థామ..5న పరీక్షలు ఉన్నందున రోడ్డు దిగ్బందనాల్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

జేఏసీ నేతలుగా ఉంటే బుగ్గ కార్లొస్తాయా..?

కార్మికులు ఆవేదనతో పిట్టల్లా రాలిపోతున్నారని, తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చర్చలు చేయకుండా కార్మికులు బేషరతుగా  విధుల్లోకి చేరాలని హుకుం జారీ చేయడం సరైన పద్దతి కాదన్నారు. కేసీఆర్ కోర్టులను , అడ్వికేట్ లను డిక్టేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నుంచి తీసే అధికారం ఎవరికి లేదన్న అశ్వత్థామ…5వేల బస్సులు ప్రైవేటీకరణ చేస్తే కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నష్టాలొచ్చే రూట్లలో ప్రైవేట్ వాళ్లకు ఇస్తామంటున్నారు…వాళ్ళు ఏమైనా పిచ్చోళ్లా అని అన్నారు.  ప్రభుత్వాన్ని తాము డబ్బులు అడగడం లేదని, ఉన్న ట్యాక్స్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె ఇల్లీగల్ ఎలా అవుతుందో చెప్పాలన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన సమ్మె లీగల్.. ఇప్పుడు ఇల్లీగలా అని వ్యాఖ్యానించారు.  విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, రాజకీయ పార్టీల మద్దతుతో సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ రిక్రూట్ మెంట్ లో రిజర్వేషన్లను అమలు చేయడం మంచిదేనన్న అశ్వత్థామ..కార్మికుల సమస్యలు పరిష్కరించండి…యూనియన్ లు కూడా తమకు అవసరం లేదన్నారు. జేఏసీ నేతలుగా ఉంటే బుగ్గకార్లు ఏమైనా వస్తాయా అని అశ్వత్థామరెడ్డి చమత్కరించారు.