మహారాష్ట్రలో  8వ తరగతి వరకు పరీక్షల్లేవ్.. అందరూ పైతరగతులకు ప్రమోట్

మహారాష్ట్రలో  8వ తరగతి వరకు పరీక్షల్లేవ్.. అందరూ పైతరగతులకు ప్రమోట్
  • కరోనా నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

ముంబై: కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ కీలక ప్రకటన చేశారు. ఒకటవ తరగతి నుంచి ఎనిమదవ తరగతి వరకు విద్యార్థులందరిని పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అవసరమైన విధి విధానాలు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఉన్నత తరగతులకు ప్రమోట్ చేస్తామని.. 9 11వ తరగతుల విద్యార్థులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా నేపధ్యంలో తరగతుల నిర్వహణ.. కొనసాగింపుపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా.. చాలా మందికి అందుబాటులో లేకపోవడం.. హాజరైన విద్యార్థులు కూడా సరిగా అర్థం కావడం లేదని.. ఫీజులు కట్టలేకపోతున్నామని ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి సంచలన ప్రకటన చేసింది. మహారాష్ట్రలో సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నివారించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.