పదిలో ఫెయిల్​ అవుతున్నా ఫోకస్​ కరువు

పదిలో ఫెయిల్​ అవుతున్నా ఫోకస్​ కరువు

ఫెయిల్​ అవుతున్నా ఫోకస్​ ఏది?

హైదరాబాద్‍, వెలుగు: టెన్త్ ఎగ్జామ్‍లో 100 శాతం పాస్‍ పర్సంటేజీని సాధించేందుకు కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ రూపంలో అది కనిపించడం లేదు. ఉన్నత చదువులకు కేరాఫ్‍గా నిలుస్తున్న హైదరాబాద్‍.. పదేండ్లుగా టెన్త్ రిజల్ట్స్ లో అట్టడుగు స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఆ పరిస్థితిని మార్చేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదు. ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ పై జిల్లా కలెక్టర్‍ మాణిక్‍రాజ్‍ కన్నన్‍తో జరిగిన సమీక్షలో స్టూడెంట్స్ ఎక్కువగా ఫెయిలవుతున్న జనర ల్‍సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విద్యాశాఖాధికారులకు సూచించారు.

జిల్లా స్థానాన్ని ఈ ఏడాది ఎలాగైనా మెరుగు పరచాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గతేడాది గవర్నమెంట్‍ స్కూల్స్ లోని మ్యాథ్స్, జనరల్‍ సైన్స్ సబ్జెక్టుల టీచర్లకు ఒక రోజు ప్రత్యేక ట్రైనింగ్‍ ఇచ్చారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించ లేదని సమాచారం. విద్యాశాఖ అధికారులు గవర్నమెంట్‍ స్కూళ్లపైనే ఫోకస్‍ పెడుతున్నారు. కానీ అధిక శాతం మంది టెన్త్ స్టూడెంట్స్ ప్రైవేట్‍ స్కూల్స్ నుంచే హాజరవుతారు. జిల్లా ర్యాంకింగ్‍పై  తీవ్ర ప్రభావం చూపే ప్రైవేట్‍ స్కూళ్లపై అధికారులు దృష్టి సారించడం లేదు.  కనీసం ఇప్పటికైనా టెన్త్ ఎగ్జామ్స్ పై ప్రైవేట్‍ స్కూల్స్ నిర్వాహకులతో విద్యాశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ ప్రిపరేషన్‍పై సమీక్షించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

ఆ రెండింటిలోనే ఎక్కువ మంది ఫెయిల్‍

గతేడాది హైదరాబాద్​ జిల్లాలో 70,173 మంది గవర్నమెంట్‍, ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ టెన్త్ ఎగ్జామ్స్ కు అటెండయ్యారు. ఇందులో 58,306 మంది పాస్‍ అయ్యారు. 83.09 శాతం పాస్‍ పర్సంటేజీగా నమోదైంది. అంతకుముందు అకాడమిక్‍ ఇయర్‍తో పోల్చితే ఇది 7.08 శాతం అధికం. కానీ ఫెయిలైన మొత్తం స్టూడెంట్స్ లో 69 శాతం మంది జనరల్‍ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లోనే ఫెయిలయ్యారు. ఇందులోనూ ప్రైవేట్‍ స్కూల్స్ లోని వారే అధికంగా ఉన్నారు. మ్యాథమెటిక్‍ సబ్జెక్టులో ఫెయిల్‍ అయిన వారిలో గవర్నమెంట్‍ స్కూల్స్ స్టూడెంట్స్​738 మంది ఉండగా, 6901 మంది ప్రైవేట్‍ స్కూల్స్ వారు ఉన్నారు. అదే జనరల్‍ సైన్స్ సబ్జెక్టు పరంగా గవర్నమెంట్‍లో 497 మంది, ప్రైవేట్‍ స్కూల్స్ విద్యార్థులు 5636 మంది ఉన్నారు. దీంతోపాటు గతేడాది గవర్నమెంట్‍, ప్రైవేట్‍ స్కూళ్ల పరిధిలో ఫస్ట్ లాంగ్వేజీలో 2320 మంది, సెకండ్‍ లాంగ్వేజీలో 657 మంది, థర్డ్ లాంగ్వేజీలో 1359 మంది, సోషల్‍ స్టడీస్‍లో 1649 మంది స్టూడెంట్స్ ఫెయిల్‍ అయిన వారిలో ఉన్నారు.

ఆ నాలుగు మండలాల్లో పాస్​ అయినోళ్లు 40 శాతమే

ఈ ఏడాది మార్చి నెల చివరిలో జరగనున్న టెన్త్ ఎగ్జామ్‍లో 73 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గవర్నమెంట్‍ స్కూల్స్ పరిధిలో ఇప్పటికే స్పెషల్‍ క్లాస్‍లు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఒక గంట ప్రత్యేకంగా టెన్త్ స్టూడెంట్స్ ప్రిపరేషన్‍ కోసం కేటాయించారు. ఇందులో డైలీ ఒక సబ్జెక్టులో క్లాస్‍లు తీసుకుంటున్నారు. సిలబస్‍ పూర్తైన స్కూళ్లలో ఈవెనింగ్‍ ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టులో మోడల్‍ ఎగ్జామ్‍ నిర్వహిస్తున్నామని టీచర్లు తెలిపారు. బహదూర్‍పురా, నాంపల్లి, అసిఫ్‍నగర్‍, చార్మినార్‍ మండలాల్లోని మెజారిటీ ప్రైవేట్‍, గవర్నమెంట్‍ స్కూళ్లలో స్టూడెంట్స్ లో ఏటా ఎగ్జామ్‍లో పాసయ్యే టెన్త్  స్టూడెంట్స్  40 శాతం దాటక పోవడం విశేషం. ఆయా మండలాలపై విద్యా శాఖ అధికారులు ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.