న్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని వ్యూహాత్మక చాబహార్ పోర్టు ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో సర్కారు ఎటువంటి నిధులను కేటాయించలేదు. ఇరాన్‌లోని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం గత కొన్నేండ్లుగా భారత్ ఏటా రూ.100 కోట్లను కేటాయిస్తూ వస్తున్నది. అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో ఈ పోర్టు భారత్‌కు అత్యంత కీలకం.
చాబహార్ పోర్టు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ముఖద్వారాన ఉన్నది. ఇది ఇరాన్లో మొట్టమొదటి డీప్ వాటర్ పోర్టు. ఆ దేశానికి ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాలకు నేరుగా ప్రవేశాన్ని కల్పిస్తున్నది. పాకిస్తాన్లో చైనా నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా భారత్ చాబహార్ ను అభివృద్ధి చేస్తున్నది.
ఈ పోర్టుతో పాకిస్తాన్ ను బైపాస్ చేసే అవకాశం ఇండియాకు లభిస్తున్నది. అఫ్గానిస్తాన్, మధ్య ఆసియాకు వెళ్లేందుకు పాకిస్తాన్ తన భూమార్గం నుంచి ఎంట్రీ ఇవ్వకపోవడంతో ఆ అడ్డంకిని అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా భారత్ చాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తున్నది.
