రెండేండ్ల కిందట కాన్పు అయినోళ్లకూ కేసీఆర్ కిట్ ఇయ్యలే

రెండేండ్ల కిందట కాన్పు అయినోళ్లకూ కేసీఆర్ కిట్ ఇయ్యలే
  • 6 లక్షల మంది బాలింతలకు బకాయిపడ్డ ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ కిట్ స్కీమ్‌‌కు నిధుల కొరత ఏర్పడింది. స్కీమ్‌‌లో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన నగదు ప్రోత్సాహాన్ని సర్కారు దాదాపుగా ఆపేసింది. రెండేండ్ల కిందట కాన్పు అయినోళ్లకు కూడా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని సంబంధిత ఆఫీసర్లను ప్రశ్నిస్తే, సర్కార్ వద్ద డబ్బులు లేవని చెబుతున్నారు. కేసీఆర్‌‌‌‌ కిట్ స్కీమ్‌‌ను 2017లో ప్రారంభించారు. ఈ స్కీమ్‌‌లో భాగంగా కిట్‌‌తో పాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడైతే రూ.12 వేల చొప్పున ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ యాంటీనాటల్ చెకప్‌‌ నుంచి బిడ్డ పుట్టిన తొమ్మిది నెలల్లోపు నాలుగు దఫాల్లో ఈ మొత్తాన్ని తల్లి అకౌంట్‌‌లో జమ చేసేవారు.  సుమారు ఆరు లక్షల మంది గర్భిణులు, బాలింతలకు సర్కారు బకాయి పడింది. వీళ్లందరికీ కలిపి సుమారు రూ.750 కోట్లు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల చేయాలని సర్కార్ దృష్టికి తీసుకుపోయినా, ఫలితం ఉండడం లేదంటున్నారు. గర్భందాల్చిన తర్వాత పేద మహిళలు కూలిపనులకు పోకూడదన్న ఉద్దేశం, పౌష్టికాహారం అందించడం కోసం డబ్బులు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ పలుమార్లు తన ప్రసంగాల్లో చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా, కిట్లకే స్కీమ్‌‌ను పరిమితం చేస్తుండడం గమనార్హం.

హెల్త్ వర్కర్లతో జగడం

కేసీఆర్ కిట్ డబ్బులు నిలిపివేత ప్రభావం క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ వర్కర్ల మీద పడుతోంది. కేసీఆర్ కిట్ రిజిస్ర్టేషన్ బాధ్యతలన్నీ ఆశా వర్కర్లు, ఏఎన్‌‌ఎంలే చూసుకుంటున్నారు. గర్భిణుల వివరాలన్నీ వాళ్లే పోర్టల్‌‌లో ఎంటర్ చేస్తున్నారు. దీంతో డబ్బులు రాకపోతే గర్భిణులు, వాళ్ల కుటుంబ సభ్యులు హెల్త్ వర్కర్లనే నిలదీస్తున్నారు. కొంత మందికి ఒకట్రెండు కిస్తీలు వచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి. దీంతో కావాలనే హెల్త్ వర్కర్లు తమకు డబ్బులు రాకుండా చేస్తున్నారని గొడవకు దిగుతున్నారు. 

రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా 

మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్ల క్రితం డెలివరీ చేయించుకున్నాను. ఆడబిడ్డ పుట్టింది. ఇప్పటికీ ఆర్థిక సహాయం అందలేదు. ఆసుపత్రికి వెళ్లి అడిగితే ఆన్‌‌లైన్ చేసి పంపినమని చెబుతున్నరు. - వల్లోజు రేణుక, మునగాల, సూర్యాపేట