డబ్బుల్లేవ్.. జీతాలియ్యలేం: ఆర్టీసీ మేనేజ్​మెంట్

డబ్బుల్లేవ్.. జీతాలియ్యలేం: ఆర్టీసీ మేనేజ్​మెంట్
  • హైకోర్టుకు చెప్పిన ఆర్టీసీ మేనేజ్​మెంట్
  • వేతనాల కోసం నెలకు రూ.239 కోట్లు కావాలి
  • ఇప్పుడు రూ.7.49 కోట్లే ఉన్నాయి
  • ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే జీతాలిచ్చే పరిస్థితి ఉంది
  • గడ్డు పరిస్థితుల వల్లే కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేదని వెల్లడి
  • వాదనలు నోట్​ చేసుకున్న న్యాయమూర్తి.. విచారణ 29కి వాయిదా
  • సమ్మెపై సోమవారం మూడు పిల్స్​ దాఖలు
  • 28న మెయిన్​ పిటిషన్​తో కలిపి విచారిస్తామన్న డివిజన్​ బెంచ్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు పైసల్లేవని, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని సంస్థ మేనేజ్​మెంట్​ హైకోర్టుకు చెప్పింది. సిబ్బందికి జీతాలు ఇవ్వాలంటే నెలకు రూ.239 కోట్లు కావాలని, కానీ ఇప్పుడు ఆర్టీసీ దగ్గర రూ.7.49 కోట్ల డబ్బు మాత్రమే ఉందని తెలిపింది. ప్రభుత్వం ఏటా డబ్బులిస్తేనే ఆర్టీసీలో జీతాలు చెల్లించే పరిస్థితులు ఉన్నాయని వివరించింది. అందువల్ల కార్మికుల సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. కార్మికులు సమ్మెకు వెళ్లడానికి ముందు సెప్టెంబర్‌‌  నెలలో పనిచేసిన కాలానికి సంబంధించిన జీతాలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్‌‌ యూనియన్‌‌ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు, మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై న్యాయమూర్తి జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ సునీల్​శర్మ తరఫున అడిషనల్​ ఏజీ జె.రామచందర్​రావు వాదనలు వినిపించారు.ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం అన్యాయమని పేర్కొన్నారు.

సొంత ఆదాయం చాలట్లే..

‘‘ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం. ఆర్టీసీలో డబ్బులు లేవని తెలిసి కూడా కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. అందువల్ల దీనిని చట్టవిద్ధంగా హైకోర్టు ప్రకటించాలి. ఆర్టీసీ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి యాజమాన్యం వద్ద డబ్బుల్లేవు. జీతాలు ఇవ్వాలంటే నెలకు రూ.239 కోట్లు కావాలి. కానీ ఇప్పుడు ఆర్టీసీ దగ్గర ఉన్నది రూ.7.49 కోట్లు మాత్రమే. ఆర్టీసీకి ఏటా ప్రభుత్వం నిధులు ఇస్తేనే జీతాలు చెల్లించే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి నెలా ఆర్టీసీ సొంత ఆదాయం నుంచి జీతాలు ఇవ్వలేకపోతోంది.” అని ఏజీ కోర్టుకు వివరించారు. ఉమ్మడి ఏపీ చివరి ఐదేళ్లలో అప్పటి సర్కారు ఆర్టీసీకి ఇచ్చిన మొత్తం రూ. 712 కోట్లు మాత్రమేని, గత ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా రూ.4,250 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఆర్టీసీకి ఏటా రూ.1,200 కోట్ల మేరకు నష్టాలు వస్తున్నాయన్నారు. రూ.4,882 కోట్లు ఆదాయం వస్తే.. ఖర్చు మాత్రం రూ.5,811 కోట్లుగా ఉందన్నారు. ఆదాయంలో 58 శాతం జీతాల చెల్లింపులకే సరిపోతోందని పేర్కొన్నారు.

మూడు పిల్స్‌ దాఖలు

ఆర్టీసీ సమ్మెపై విడివిడిగా మూడు పిల్స్‌ దాఖలయ్యాయి. వాటిని సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌  పరిశీలించింది. వాటిని కూడా 28వ తేదీన మెయిన్​ పిటిషన్​తో కలిపి విచారిస్తామని తెలిపింది.

అప్పులు రూ.4,709 కోట్లు..

ఆర్టీసీకి రూ. 4,709 కోట్లు అప్పులు ఉంటే.. అందులో రూ.1,660 కోట్లు క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీవి అని, పీఎఫ్, రిటైర్మెంట్‌ బినిఫిట్స్, లీవుల నగదు రూ.3,049 కోట్లు అని న్యాయమూర్తికి అడిషనల్​ ఏజీ వివరించారు. 2015లో 44 శాతం ఫిట్​మెంట్​ ఇచ్చినందున ఏటా రూ. 900 కోట్ల చొప్పున, 2017లో 16 శాతం ఐఆర్​ ఇవ్వడం వల్ల ఏటా రూ.200 కోట్ల చొప్పున ఆర్టీసీపై భారం పడిందని చెప్పారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల కారణంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేదని, వాటిని ఆమోదిస్తే ఆర్టీసీ పరిస్థితి మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమ్మెను చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను 29వ తేదీకి వాయిదా వేశారు.

No funds to pay salaries of RTC Employees: RTC Management