40 ఏండ్లుగా ప్రభుత్వ దవాఖానా లేదు

40 ఏండ్లుగా ప్రభుత్వ దవాఖానా లేదు

రామకృష్ణాపూర్ (మందమర్రి), వెలుగు:  రాష్ట్రంలో గల్లీకో వైన్​షాపు పెడుతున్న సర్కారు ప్రభుత్వ దవాఖానాల ఏర్పాటు గురించి ఆలోచించడం లేదు. ప్రతి మండలంలో  ప్రైమరీ హెల్త్​ సెంటర్, మున్సిపాలిటీల్లో అర్బన్​ హెల్త్​ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరడంలేదు. ఇందుకు ఉదాహరణే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతన్​పల్లి మున్సిపాలిటీ. ఇక్కడ 40 ఏండ్లుగా ప్రభుత్వ దవాఖానా లేక జనాలు అరిగోస పడుతున్నారు. ఇక్కడ 40 వేల మంది జనాభా ఉన్నా ఒక్క సబ్ ​సెంటర్​ కూడా లేదు. 

సగం కంటే ఎక్కువ 
సింగరేణి బొగ్గు గనులతో  ఏర్పాటైన రామకృష్ణాపూర్​(క్యాతన్​పల్లి) సమైక్య రాష్ట్రంలో అతిపెద్ద మేజర్​ పంచాయతీగా ఉండేది. 2018లో దీనికి దగ్గర్లోని తిమ్మాపూర్ పంచాయతీని విలీనం చేసి  క్యాతన్​పల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. విలేజ్​నుంచి టౌన్​స్థాయికి ఎదిగినా ఫెసిలిటీస్​విషయంలో అక్కడే ఆగిపోయింది. ముఖ్యంగా వైద్యం విషయంలో ఇంకా వెనకబడే ఉంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉండే సింగరేణి ఎంప్లాయీస్, ​వారి ఫ్యామిలీస్ ​కోసం సింగరేణి మేనేజ్​మెంట్​రామకృష్ణాపూర్​లో ఏరియా హాస్పిటల్​ ఏర్పాటు చేసింది. మొదట్లో సింగరేణి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ దవాఖానా వారి అవసరాలకు సరిపోయేది. రాను రాను కోల్​మైన్స్​మూసివేయడం, ఎంప్లాయీస్​ వేరే ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్​ అయి వెళ్లిపోవడం, రిటైర్డ్ ​కావడంతో వారి సంఖ్య తగ్గిపోయింది. రోజూ ఇతర పనులు చేసుకుంటూ బతికే కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది.  దీంతో ఈ మున్సిపాలిటీలో జనాభా 40 వేలకు చేరింది. ఇందులో 5 వేల వరకు సింగరేణికి చెందిన వారు కాగా,  మిగిలిన వారంతా కాట్రాక్ట్​ కార్మికులు, వెహికిల్ డ్రైవర్లు, చిన్న చిన్న ఇండస్ట్రీల్లో  పని చేసేవారు, కూలీ చేసుకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు, షాపుల్లో వర్కర్స్​, బిల్డింగ్​నిర్మాణ పనుల్లో పాల్గొనే వారే ఉన్నారు.   

ప్రాణాలు పోతున్నాయ్
క్యాతన్​పల్లిలో ఏదైనా ప్రమాదమో, ఆపదో వచ్చినప్పుడు లోకల్​గా సర్కారు దవాఖానా లేక, ప్రైవేట్​కు వెళ్లి స్థాయికి మించి ఖర్చు చేయలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఎయిడ్​కు కూడా నోచుకోవడం లేదు. ముఖ్యంగా ప్రెగ్నెంట్​ లేడీస్ ​కాన్పు కోసం, పాము కాటేసినప్పుడు, హార్ట్​ఎటాక్​, సూసైడ్ ​అటెంప్ట్స్, రోడ్ ​యాక్సిడెంట్స్​ జరిగినప్పుడు బాధితులను 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని మందమర్రి, మంచిర్యాలలోని సర్కార్​, ప్రైవేటు దవాఖానాలకు తీసుకెళ్తున్నారు. దీనికి కనీసం గంట టైం పడుతోంది. దీంతో చాలామంది దారిలోనే కన్నుమూస్తున్నారు.  

గేటు పడితే ఆశ వదులుకోవాల్సిందే
ఎమర్జెన్సీ టైంలో మంచిర్యాల హాస్పిటల్​కు వెళ్లేప్పుడు క్యాతన్​పల్లి వద్ద రైల్వే గేట్​పడితే ఇక ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఇక్కడ ఏడేండ్ల కింద రైల్వే ఫ్లైఓవర్​బ్రిడ్జి మంజూరు కాగా ఆ పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. రెండేండ్ల కింద అల్లూరి సీతారామరాజునగర్​కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భార్య భవానికి హార్ట్​ఎటాక్ ​వచ్చింది. ఆమెను దవాఖానాకు తీసుకువెళ్తుండగా రైల్వే గేటు పడి ఇన్​టైంలో ట్రీట్​మెంట్ ​అందక చనిపోయింది. ఇలా చాలా సంఘటనలున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 50 మంది వరకు ఆర్ఎంపీలు ఉండగా జ్వరాలకు, నొప్పులకు వీరినే ఆశ్రయించాల్సి వస్తోంది. రెండేండ్లుగా కరోనాతో స్థానికుల తిప్పలు ఎక్కువయ్యాయి. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే టెస్టులు, ట్రీట్​మెంట్ ​కోసం భయపడుతూనే మంచిర్యాల, మందమర్రిలకు వెళ్తున్నారు.  

పట్టించుకోని ప్రజాప్రతినిధులు 
క్యాతన్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు సర్కార్​ దవాఖానా కోసం ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ చూపడంలేదు. కనీసం ఇక్కడో హాస్పిటల్​ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా పెట్టలేదు. రూ.14లక్షలతో మూడేండ్ల కిందట రామకృష్ణాపూర్​లోని శివాజీనగర్​లో నిర్మించిన సబ్​సెంటర్​ ప్రారంభానికే నోచుకోలేదు. కేవలం మందమర్రిలోని యూపీహెచ్​ఎస్​, అర్బన్​ హెల్త్​ సెంటర్ కు చెందిన ఏఎన్​ఎంలు సీజనల్​ రోగాలిస్తే గోలీలిస్తున్నారు.  ఇప్పటికైనా సర్కారు స్పందించి తమ ప్రాంతంలో సర్కారు దవాఖానా ఏర్పాటు చేయాలని క్యాతన్​పల్లి వాసులు కోరుతున్నారు.