వానలు వస్తలేవు

వానలు వస్తలేవు

రాష్ట్రంలో వాన వస్తలేదు. వరుణుడు ముఖం చాటేస్తున్నడు. వర్షాలు లేక రైతన్న ఆపసోపాలు పడుతున్నడు. చిరుజల్లులతోనే కాలం గడుస్తోంది. దీంతో సీజన్‌‌లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. జూన్‌‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటిదాకా 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 218.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 146 మి.మీ. మాత్రమే కురిసింది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 77 శాతం లోటు రెయిన్‌‌ఫాల్‌‌ నమోదైంది. ఇక్కడ 220.6 మి.మీ. వర్షపాతం రికార్డు కావాల్సి ఉండగా, కేవలం 49.9 మి.మీ. మాత్రమే పడింది. నల్లగొండలో 69 శాతం, సూర్యాపేటలో 64 శాతం, యాదాద్రి భువనగిరిలో 54 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. కరీంనగర్‌‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లాలు మినహా అన్ని చోట్ల లోటు వర్షపాతమే నమోదైంది. కుమ్రంభీం జిల్లాలో 4 శాతం అధికంగా రెయిన్‌‌ఫాల్‌‌ రికార్డయింది. అల్పపీడనాలు, ద్రోణులు, ఆవర్తనాలు ఏర్పడకపోవడంతోనే వర్షాలు పడటంలేదని హైదారబాద్‌‌ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఎండలు దంచుతున్నయి

మరోవైపు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. ఓ వైపు ఉక్కపోత పెరుగుతోంది. దీంతో వర్షాలు పడతాయని ఆశగా ఎదురుచూస్తున్నా అదీ లేదు. శనివారం అత్యధికంగా ఖమ్మంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌‌నగర్‌‌లో 37, రామగుండంలో 35.4 డిగ్రీల టెంపరేచర్‌‌ రికార్డయింది. శుక్రవారం కూడా ఖమ్మంలో అత్యధికంగా 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.

తేలికపాటి వర్షాలే

రాష్ట్రంలో శనివారం కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులే కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌‌లో అత్యధికంగా 31 మి.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలోని బిజ్వార్‌‌లో 29.8 మి.మీ., రంగారెడ్డి జిల్లాలోని చిక్కాపూర్‌‌లో 29.5, మెదక్‌‌లోని మంగల్‌‌పర్తిలో 28.8 మి.మీ. వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో పలు చోట్ల ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది.