హెల్మెట్ పెట్టనోళ్లు ఎక్కువైన్రు

హెల్మెట్ పెట్టనోళ్లు ఎక్కువైన్రు

సిటీలో ఈ ఏడాది 32,82,661 కేసులు

మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనలు 37.17 లక్షలు

రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులు

ప్రమాదకరంగా రోడ్లపైకి.. రాంగ్ రూట్, డ్రంకెన్ డ్రైవ్ ..

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ ఈ ఏడాది 37.17 లక్షల కేసులు

హెల్మెట్ వాయిలేషన్స్ 32.82లక్షలు..
ట్రిపుల్ రైడింగ్ 78 వేలు

ట్రాఫిక్ ఉల్లం ఘన కేసులు ఏటా పెరుగుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఇయర్ డిసెంబర్ 13 వరకు ​ 37,17,142 నమోదయ్యాయి. అందులో హెల్మెట్ కేసులే అధికం. ఆ తర్వాతి స్థానాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉన్నాయి. ఇలా వాహనదారులు రూల్స్ బ్రేక్ చేసి కోట్ల రూపాయలు జరిమానాగా చెల్లిస్తున్నారు. మరోవైపు యాక్సిడెంట్స్‌కు కారణమవుతున్నారు.

హైదరాబాద్, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ రూల్ బ్రేక్ చేస్తూ వాహనదారులు కెమెరాలకు చిక్కు తున్నారు. ట్రాఫిక్ పోలీసుల డిజిటల్ కెమెరాలు, సిటీ సిగ్నల్స్‌లో ఏర్పాటు చేసిన హై డెఫినేషన్ సీసీ కెమెరాలతో చలానాలు జనరేట్ చేస్తున్నారు. ఇందుకోసం బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో స్పెషల్ టీమ్ పనిచేస్తోంది. ఈ టీమ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలిచే వాహనదారులతో పాటు సిటీ రోడ్లపై ట్రావెల్ చేసే వాహనదారుల హెల్మెట్, సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ క్రాస్ చేసే వాహనాల నంబర్లను గుర్తిస్తోంది. సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యే వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా చలానాలను జనరేట్ చేసి ఓనర్ మొబైల్ నంబర్‌కు మెసేజ్‌తో పాటు ఇంటికి చలానా కూడా పంపిస్తున్నారు. ఒక్కో వాయిలేషన్‌కు ఎంవీ యాక్ట్ ప్రకారం వందకు తగ్గకుండా చలానాలు ఉంటున్నాయి. దీనికి తోడు సర్విస్ చార్జీల పేరుతో మరో రూ.35 అదనంగా వేస్తున్నారు. ఇలా సిటీలో ట్రాఫిక్ కేసులు ఏటా లక్షల సంఖ్యలో పెరిగి పోతున్నాయి. ఇట్లా సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో రూల్స్ బ్రేక్ చేస్తూ వాహనదారులు ప్రత్యేక్షంగా, పరోక్షంగా జేబుకు చిల్ పెట్టుకుంటున్నారు.

ఏటా 27లక్షలకు తగ్గని హెల్మెట్ కేసులు
ప్రాణాలకు తీవ్ర హాని కలిగించే 10 రకాల రూల్స్ పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌తో పాటు ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ క్రాస్,సెల్ ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంపై చలానాలు జనరేట్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఏటా 27లక్షలకు తగ్గకుండా హెల్మెట్ చలానాలు ఉంటున్నాయి. ఆ తర్వాత ప్లేస్​లో 12 లక్షలకు తగ్గకుండా రాంగ్ సైడ్ డ్రైవింగ్, 55వేల చలానాలతో ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదవుతున్నాయి.

ఈ ఏడాది 32.82లక్షలు
పెండింగ్ చలానాలతో చెకింగ్‌లో పట్టుబడ్డ వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో లక్షల కేసులను నమోదు చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7లక్షల కేసులు అదనంగా నమోదయ్యాయి. సిటీలోని 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రమాదకర ట్రాఫిక్ కేసులను గతేడాది 30.20లక్షల కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 13 వరకు 37.17లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో హెల్మెట్ కేసుల సంఖ్య 32.82లక్షలు కాగా, గతేడాది 27.10 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో ఒక్కో
చలానాను రూ.100 ఫైన్ తో పాటు మరో రూ.35 సర్వీస్ చార్జ్‌గా విధిస్తున్నారు.