డాక్టర్లు,నర్సులకు సెలవుల్లేవ్: ఈటల​         

డాక్టర్లు,నర్సులకు సెలవుల్లేవ్: ఈటల​         

హైదరాబాద్‌, వెలుగు: సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖాన్లలో పన్జేస్తున్న డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈమేరకు వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌‌ సూచనతో ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్థాయిల్లోని ఆస్పత్రులకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పారు. విష జ్వరాలు, ఇతర సీజనల్‌ రోగాల కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల అధికారులకు సూచించారు. దవాఖాన్లలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలని, ఆవరణలో పిచ్చి మొక్కలు, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో పాము కాటు కేసులు పెరిగే అవకాశం ఉందని, యాంటీ వీనం అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. పాత భవనాల్లో కొనసాగుతున్న ఆస్పత్రులలో రోగులను ఇతర భవనాలకు మార్చాలని ఆదేశించారు. పరిస్థితి కుదుట పడేవరకూ డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది అంతా సహకరించాలని మంత్రి ఈటల కోరారు.