సదర్మాట్ కాల్వకు ఫారెస్ట్ అడ్డంకులు

సదర్మాట్ కాల్వకు  ఫారెస్ట్ అడ్డంకులు

ఖానాపూర్,వెలుగు: నిర్మల్​జిల్లా మామడ మండలం పోన్కల్​వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నుంచి ఖానాపూర్ లోని పాత సదర్మాట్  బ్యారేజీ వరకు సుమారు ఏడు కిలో మీటర్ల కాల్వ నిర్మాణానికి అడ్డంకులు తప్పేలా లేవు.  కొత్త సదర్మాట్ నుంచి పాత సదర్మాట్ వరకు ఉన్న ఏరియా అంతా అటవీశాఖ పరిధిలో ఉండడంతో  అనుమతులు రావడం సాధ్యం కాదని ఇరిగేషన్​ఆఫీసర్లు చెబుతున్నారు. పొన్కల్ బ్యారేజీ నుంచి పాత సదర్నాట్ బ్యారేజీ వరకు గోదావరి నదిలో కుర్రులు ఉన్నచోట అడ్డు గోడలు నిర్మిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఫలితంగా కొత్త సదర్మాట్ నీరు జగిత్యాల జిల్లా వైపు వెళ్లకుండా పాత సదర్మాట్​కు వెళ్తుందంటున్నారు. రైతులేమో కాల్వ నిర్మిస్తేనే  గోదావరి నీరు పాత సదర్మా ట్ కు చేరుతుందని... ఆయకట్టు సాగవుతుందని పేర్కొంటున్నారు.

అడ్డుగోడలకు ప్రతిపాదనలు...

ఇరిగేషన్​ఆఫీసర్లు గోదావరిలో 1.5 కిలోమీటర్ల పొడవుతో మూడు చోట్ల రూ. 3 కోట్లతో అడ్డుగోడలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కుర్రుల మధ్య నిర్మించే అడ్డుగోడలతో గోదావరి వాటర్​పోన్కల్ బ్యారేజీ నుంచి పాత సదర్మాట్ బ్యారేజీకి చేరుకుంటుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఫలితంగా పాత సదర్మాట్ బ్యారేజీలో రైతులకు మూడు సీజన్లకు సాగునీరు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.

13 వేల ఎకరాల ఆయకట్టు..

ప్రస్తుతం పాత సదర్మాట్ బ్యారేజీ కింద దాదాపు 13 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. ఏటా గోదావరి నది ప్రవాహం వేసవిలో తగ్గడంతో పాత సదర్మాట్ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని రైతులు కొత్త సదర్మాట్ బ్యారేజీ నుంచి పాత సదర్మాట్ బ్యారేజీ వరకు కాల్వ నిర్మించాలని డిమాండ్​చేస్తున్న విషయం తెలిసిందే. 

ఆందోళనకు గురి కావద్దు..

పోన్కల్ వద్ద  నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నుంచి పాత సదర్మాట్ బ్యారేజీ వరకు కాల్వ నిర్మాణం విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దు. ఈ కాల్వ నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు దొరకడం కష్టం. కాల్వకు   ప్రత్యామ్నాయంగా  గోదావరి నదిలో అడ్డు గోడల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు రెడీ చేశాం. అడ్డుగోడల కారణంగా కొత్త బ్యారేజీ నుంచి పాత బ్యారేజీలోకి పుష్కలంగా నీరు వచ్చి చేరుతుంది - రామారావు, ఇరిగేషన్ ఈఈ,నిర్మల్

సీఎం హామీ నెరవేర్చాలి..

కొత్త సదర్మాట్ నుంచి పాత సదర్మాట్ వరకు ఏడు కిలో మీటర్ల ప్రత్యేక కాల్వ నిర్మిస్తామని 2018లో సీఎం కేసీఆర్​హామీ ఇచ్చారు. కానీ.. ఇరిగేషన్ ఆఫీసర్లు మాత్రం కాల్వ నిర్మాణం కోసం ఫారెస్ట్ అనుమతులు అడ్డు వస్తున్నాయని చెప్పడం దారుణం. సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. - రాజేందర్, సదర్మాట్, కాల్వ సాధన సమితి అధ్యక్షుడు