సాధారణంగా ఏ దేశంలోనైనా సంపాదించే ప్రతి రూపాయిపై ప్రభుత్వానికి పన్ను చెల్లించడం పౌరుల బాధ్యత. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు తమ పౌరుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను వసూలు చేయటం లేదు. అంటే మీరు నెలకు ఎంత సంపాదిస్తే అంతా మీ జేబులోకే వెళ్తుంది. ఇలా పన్ను రహిత జీతాలను అందించే 'శాలరీ హెవెన్స్' గురించి ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధానంగా గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్ దేశాల్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదు. వీటితో పాటు బహమాస్, మొనాకో, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ వంటి దేశాలు కూడా పౌరుల ఆదాయంపై పన్ను విధించవు.
1. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా, ఫుజైరా వంటి ఎమిరేట్స్ కలిగి ఉన్న ఈ దేశంలో వ్యక్తుల ఆదాయంపై పన్ను ఉండదు. ఇక్కడ పనిచేసే వారు తమ జీతాన్ని 100% సొంతం చేసుకోవచ్చు. అయితే వస్తువులు, సేవల కొనుగోలుపై 5 శాతం వ్యాట్, ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై ఎక్సైజ్ పన్ను ఉంటుంది. కార్పొరేట్ సంస్థల లాభాలపై మాత్రమే పన్ను విధిస్తారు ఇక్కడ.
2. సౌదీ అరేబియా: ఉద్యోగం ద్వారా వచ్చే జీతంపై ఇక్కడ పన్ను లేదు. విదేశీ ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తల కోసం ప్రీమియం రెసిడెన్సీ వీసాను కూడా ఈ దేశం అందిస్తోంది. అయితే వ్యాపార లాభాలపై కంపెనీల స్థాయిలో పన్నులు ఉంటాయి.
ALSO READ : కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో మహీంద్రా XUV 7XO విడుదల
3. ఒమన్: ప్రస్తుతానికి ఒమన్‌లో కూడా ఆదాయపు పన్ను లేదు. కానీ 2028 జనవరి 1 నుండి ఒమన్ ఈ పన్నును ప్రవేశపెట్టబోతోంది. ఏటా సుమారు లక్ష 09వేల200 అమెరికన్ డాలర్ల (సుమారు రూ.91 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించే వారిపై 5 శాతం పన్ను విధించనున్నారు. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యల్ప పన్ను రేటుగా నిలవనుంది.
4. ఖతార్ & కువైట్: ఖతార్‌లో వ్యక్తిగత ఆదాయంపై పన్ను సున్నా. వ్యాపారాలు కంపెనీ మొత్తం ఆదాయంలో 10 శాతం వార్షిక స్థిర పన్ను రేటు అమలులో ఉంది. అయితే రియల్ ఎస్టేట్ విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై కూడా ఇక్కడ మినహాయింపు ఉంటుంది. ఇక కువైట్‌లో కూడా స్థానిక కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల జీతంపై ఎలాంటి పన్ను ఉండదు.
ఈ దేశాలు నేరుగా ప్రజల ఆదాయంపై పన్ను వేయకపోయినప్పటికీ.. చమురు ఎగుమతులు, టూరిజం, కార్పొరేట్ పన్నుల ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాయి. విదేశాలకు వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనే ఆలోచనతో ఉండే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి భారతీయులకు ఇలాంటి అరబ్ దేశాలు మంచి ఎంపికలుగా మారాయి గడచిన కొన్ని దశాబ్ధాలుగా. భారత్ లో సంపాదించే కొద్ది సొమ్ముపై మళ్లీ టాక్స్ అంటే మిగిలేది ఏం లేదని భావించే చాలా మంది ఈ దేశాలకు ఉపాధి అవకాశాల కోసం వెళ్లటం ప్రతి ఏటా మనం చూస్తూనే ఉంటాం.
