- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్రు: కె.లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్, డివల్యూషన్, డిస్క్రిమినేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు అల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. ఉత్తర-, దక్షిణ విభజన అనే కొత్త వాదనను తెరపైకి తెచ్చి రాజకీయం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రస్తుత సీట్ల నిష్పత్తికి భంగం కలగకుండా 50 శాతం సీట్లు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోందని, దీనివల్ల లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉందన్నారు. సీట్లు పెరిగితే ఎస్సీ, ఎస్టీ, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని, ఇది కాంగ్రెస్‌కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు, కేవలం ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం మాత్రమే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారని లక్ష్మణ్ వివరించారు.
2026 జనాభా లెక్కల వల్ల జాప్యం జరిగితే 2029లో మహిళా రిజర్వేషన్లు అమలు కావని, అందుకే కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్నారు. జనాభా ప్రాతినిధ్యం లోపించడం వల్ల కొన్నిచోట్ల 40 లక్షలు, మరికొన్ని చోట్ల 10 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉండటం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. 2029లో జమిలి ఎన్నికలు జరిగినా.. అది రాజ్యాంగబద్ధంగానే జరుగుతుందని, రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా ప్రభుత్వం గడువు పొడిగింపు అనేది సాధ్యం కాదని లక్ష్మణ్ తేల్చి చెప్పారు.
