చివరి చూపూ.. దక్కుతలేదు

చివరి చూపూ.. దక్కుతలేదు

నార్మల్ గా చనిపోయినా డౌట్ పడుతున్నరు

కొద్ది మందితోనే అంత్యక్రియలు

కుటుంబ సభ్యులు, బంధువులు వస్తలేరు

కామారెడ్డి, వెలుగు: కంటికి కనిపించని కరోనా వైరస్ బంధాలు, అనుబంధాలను దూరం చేస్తోంది. చుట్టాలు, తెలిసిన వాళ్లు ఇంటికి వస్తే లోపలికి రమ్మనాలంటే ఆలోచిస్తున్నారు. ఇక కరోనాతో ఎవరైనా చనిపోతే ఇంట్లోని వ్యక్తులే వెళ్లడంలేదు. ఈ టైమ్ లో ఎవరైనా మామూలుగా చనిపోయినా వారి ఇంటివైపు వెళ్లడంలేదు. అందరూ ఉన్నా కరోనా కారణంగా చివరి చూపునకు దూరం అవుతున్నారు. జిల్లాలో కరోనా కేసులు ఇటీవల పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రానికి 2,419 కేసులు వచ్చాయి. జిల్లాలో కరోనాతో ఇప్పటికే 26 మంది చనిపోయారు. ఇందులో చాలామంది అంత్యక్రియలు ఇంట్లోని వ్యక్తులు లేకుండానే జరిగాయి.

అందరు ఉన్నా..

కామారెడ్డికి చెందిన ఓ 45 ఏండ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అతడికి ఫ్యామిలీ మెంబర్ల​తోపాటు దోస్తులు, చుట్టాలు చాలా మంది ఉన్నారు. అతడి ద్వారా ఇంట్లోని మిగతావారికి కూడా వైరస్ సోకినట్లు తేలింది. హోం ఐసోలేషన్ లో ఉన్న అతడు సిక్‌ అవగా హాస్పిటల్ లో చేర్పించారు. మూడు రోజులు బాగానే ఉన్నప్పటికీ తీవ్ర ఒత్తిడికి గురై హాస్పిటల్లో చనిపోయాడు. రాజధానిలోనే అంత్యక్రియలు చేశారు. ఎవరూ చివరి చూపునకు నోచుకోలేకపోయారు. కుటుంబ సభ్యులను అందరూ ఫోన్లలో పలకరించారే తప్పా ఇంటికి వెళ్లలేదు.

అబ్బో ఎలా చనిపోయిందో!

కామారెడ్డి జిల్లా కేం ద్రంలోని ఓ కాలనీలో ఇటీవల ఓ వృద్ధురాలు మరణించింది. చుట్టు పక్కల వారితోపాటు చుట్టా లు, తెలిసిన వారికి సమాచారం తెలిసింది. ఎలా మరణించిందో అనే ఆలోచనల్లో పడి ఎవరూ రాలేదు. ఇంట్లోని వ్యక్తులు, దగ్గరి బంధువులతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

ముగ్గురు కొడుకులు ఉన్నా..

భిక్కనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటీవల మరణించాడు. కరోనా పాజిటివ్ అని తేలగానే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయాడు. అక్కడి నుంచి సొంతూరుకు తీసుకొచ్చిన కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. వృద్ధుడికి ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఒక్కరే వెళ్లి పూర్తి చేశాడు. మరో ఇద్దరు కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కాలేదు.

రూ.లక్షలు ఖర్చు చేసినా…

జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు సిక్‌ అవగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ కరోనా సోకినట్లు నిర్ధారిం చారు. మిగతా ఫ్యామిలీ మెంబర్లు టెస్ట్ చేసుకుంటే వారిలో ముగ్గురికి నిర్ధారణ అయ్యింది . చికిత్స కోసం రూ.లక్షల్లో ఖర్చు చేశారు. వృద్ధురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయింది. అంత్యక్రియలు అక్కడే పూర్తి చేశారు. ఇంట్లోని వ్యక్తులు కూడా చివరి చూపునకు వెళ్లలేదు.