
న్యూఢిల్లీ: హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబీకులను కలిసేందుకు మీడియా, రాజకీయ నేతలను అనుమతి లేదని అధికారులు తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు రాజకీయ నేతలను, మీడియా పర్సన్స్‌ను గ్రామంలోకి అనుమతించబోం’ అని హత్రాస్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశ్ కుమార్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం కావడంతో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం సిట్‌ను ఏర్పాటు చేశారు. గ్యాంగ్ రేప్‌లో చనిపోయిన 19 ఏళ్ల దళిత యువతికి న్యాయం చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి కుటుంబీకులను కలవడానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీ, ప్రియాంకను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫ్యామిలీని కలిసేందుకు శుక్రవారం హత్రాస్ వెళ్లిన తృణమూల్ ఎంపీలను పోలీసులు నెట్టేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.