సర్కారు బడుల్లో మధ్నాహ్న భోజనం బంద్

సర్కారు బడుల్లో మధ్నాహ్న భోజనం బంద్

రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో మధ్నాహ్న భోజనం నిలిచిపోతుండడంతో విద్యార్థులు అవస్థలు పడ్తున్నారు. స్కూళ్లలో వంట చేసే ఏజెన్సీలకు ఏళ్ల తరబడి మెస్ చార్జీలు పెంచకపోవడం, 4, 5 నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులు పనుల నుండి తప్పుకుంటున్నారు. వంట బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నా, పైసల్లేక వాళ్లు కూడా చేతులెత్తేస్తున్నారు. కొన్ని చోట్ల బిల్లుల కోసం నిర్వాహకులు ఆందోళన కూడా చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో టీచర్లే వంటలు చేస్తుండగా, వీలు కాని ప్రాంతాల్లో విద్యార్థులే ఇండ్ల నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకు పైగా గవర్నమెంట్ స్కూళ్లలో 21 లక్షల మందికి పైగా చదువుతున్నారు. డ్రాపౌట్లను తగ్గించేందుకు అన్ని ప్రైమరీ, హైస్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 4 రూపాయల 97 పైసల చొప్పున, హైస్కూళ్లలో 7 రూపాయల 45 పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తగ్గట్టు మీల్స్ రేట్లు పెంచాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం ఈ డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. అంతేకాదు కొన్ని నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. కొన్ని జిల్లాల్లో గత అకాడమిక్ ఇయర్ జనవరి, ఫిబ్రవరితో పాటు.. ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల బిల్లులు కూడా ఇవ్వలేదు, ఇంకొన్ని జిల్లాల్లో గత 3 నెలల బిల్లులు చెల్లించలేదు ప్రభుత్వం. 

అయితే కొన్ని జిల్లాల్లో వంట బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. మరికొన్ని జిల్లాల్లో అక్షయపాత్ర అనే స్వచ్చంధ సంస్థకు ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 17 రోజులుగా వంట బంద్ అయింది. స్కూల్ హెడ్ మాస్టర్ చొరువ తీసుకొని కొన్ని రోజుల పాటు వేరే వారితో వంట చేయించి స్టూడెంట్స్ కు భోజనం పెట్టారు. అయినా విద్యార్థులు తమ ఇళ్ల నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని తింటున్నామన్నారు.