
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టి యూకే పారిపోయిన నీరవ్ మోడీ ఇప్పుడు రోజు ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెబుతున్నారు. యూకే కోర్టుకు ఫైన్ కట్టడానికీ అప్పు చేయాల్సిందేనని అంటున్నారు. యూకే ఉన్నత న్యాయస్థానంలో కిందటేడాదే ఇండియాకు తిప్పి పంపించే కేసులో నీరవ్ మోడీ ఓటమి పాలయ్యారు. ఆయన దాదాపు 2 బిలియన్ డాలర్లు (రూ. 16 వేల కోట్లు) పీఎన్‌బీ నుంచి అప్పు తీసుకుని, ఆ తర్వాత తిరిగి చెల్లించలేదు. సౌత్ వెస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ప్రస్తుతం నీరవ్ మోడి గడుపుతున్నారు. బార్కింగ్ సైడ్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణకు గురువారం వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. లీగల్ ఖర్చులు, ఫైన్స్ కలిపి 1,50,247 పౌండ్లను నీరవ్ మోడీ చెల్లించాల్సి ఉంది. వీటి నిమిత్తమై ఒక కేసు విచారణలో ఉంది. తన వద్ద డబ్బు లేదని, కోర్టు ఆదేశాల మేరకు లీగల్ ఖర్చులు 1.5 లక్షల పౌండ్లు చెల్లించేందుకు అప్పులు చేస్తున్నట్లు ఆయన చెప్పుకుంటున్నారు.
నెలవారీ ఖర్చుల కోసం అప్పులపైనే ఆధారపడుతున్నానని, భారత ప్రభుత్వం తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నందు వల్ల తన దగ్గర డబ్బులేవీ లేవని పేర్కొంటున్నారు. తనను ఇండియాకు తిప్పి పంపించవద్దని కోరుతూ యూకే కోర్టులలో నీరవ్ మోడీ న్యాయపోరాటం చేశారు. సుప్రీం కోర్టుకు అపీల్‌కు వెళ్లాలనే ఆయన అభ్యర్ధనను రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ (లండన్) తిరస్కరించింది. దీంతో ఆ దేశంలో ఆయన న్యాయపోరాటం ముగిసినట్లే. సీబీఐ, ఈడీల వారంట్ మేరకు 2019 మార్చి నెలలో నీరవ్ మోడీని యూకేలో అరెస్టు చేశారు. పీఎన్బీని మోసగించినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు ఈడీ మరో కేసు రిజిస్టర్ చేసింది. సాక్ష్యాల తారు మారుకు ప్రయత్నాలు చేయడంతో సీబీఐ ఇంకో కేసును కూడా ఫైల్ చేసింది.