V6 News

అమెరికా కఠిన వైఖరి: బర్త్‌ టూరిజంపై భారత ప్రయాణికులకు ఎంబసీ కొత్త హెచ్చరిక ఇదే..

అమెరికా కఠిన వైఖరి: బర్త్‌ టూరిజంపై భారత ప్రయాణికులకు ఎంబసీ కొత్త హెచ్చరిక ఇదే..

అమెరికా వీసా దరఖాస్తుదారులకు సంబంధించి న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల రెండు ముఖ్యమైన, కఠినమైన ప్రకటనలు చేసింది. పౌరసత్వం కోసం అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చే ఉద్దేశంతో వచ్చే 'బర్త్‌ టూరిజం'పై రాయబార కార్యాలయం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇదే క్రమంలో H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు డిసెంబర్ 15 నుండి సోషల్ మీడియా స్క్రూటినీని తప్పనిసరి చేసింది.

రాయబార కార్యాలయం ఎక్స్ పోస్ట్ లో B-1/B-2 (టూరిస్ట్ వీసా) దరఖాస్తుదారులకు కఠినమైన హెచ్చరిక ఇచ్చింది. అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి.. ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం ఇప్పించడమే గనక ప్రయాణానికి ప్రాథమిక ఉద్దేశం అయితే.. అలాంటి వ్యక్తుల వీసా దరఖాస్తును కాన్సులర్ అధికారులు వెంటనే తిరస్కరిస్తారని స్పష్టం చేసింది. పౌరసత్వం కోసం ప్రసవించడానికి టూరిస్ట్ వీసాను ఉపయోగించడం అనుమతించబడదని రాయబార కార్యాలయం ఈ ప్రకటనతో స్పష్టంగా పేర్కొంది. ఈ క్రమంలో 2020లో రూపొందించిన నిబంధనను పునరుద్ఘాటిస్తోంది. 

పౌరసత్వం కోసం కొందరు విదేశీయులు అమెరికాలో సంతానానికి జన్మనివ్వటం.. యూఎస్ ప్రజల వనరులపై భారం పడుతుందని, వైద్య ఖర్చులు కూడా అమెరికన్ పన్ను చెల్లింపుదారులు భరించాల్సి వస్తుందని గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

H-1B, H-4 వీసాదారులకు సోషల్ మీడియా వెట్టింగ్..

డిసెంబర్ 15 నుండి కొత్త స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రోటోకాల్ అమలులోకి తీసుకొస్తోంది అమెరికా. దీని ప్రకారం పనికోసం విదేశీయులకు ఇచ్చే H-1B వీసా, వారిపై ఆధారపడిన ఫ్యామిలీకి ఇచ్చే H-4 వీసాదారులు, వీసా కోసం దరఖాస్తు చేసినా లేదా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసినా.. వారి ఆన్‌లైన్సోషల్ మీడియా అకౌంట్లను వీసాల పరిశీలన కోసం తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. H-1B ఆమోదాలలో 70% కంటే ఎక్కువ, అలాగే H-4 EAD హోల్డర్లలో దాదాపు 90% మంది భారతీయ నిపుణులే ఉండటంతో చాలా మంది కొత్త నిబంధనలపై ఆందోళన చెందుతున్నారు. కొత్త రూల్స్ కారణంగా చాలా మంది వీసా ఇంటర్వ్యూలు కూడా రీషెడ్యూల్ చేయబడిన సంగతి తెలిసిందే.