శివారు ప్రాంతాలకు బస్సుల్లేక తిప్పలు

శివారు ప్రాంతాలకు బస్సుల్లేక తిప్పలు

హైదరాబాద్, వెలుగు: సిటీ శివారు ప్రాంతాలపై ఆర్టీసీ ఆఫీసర్లు దృష్టి పెట్టడం లేదు. ప్రయాణికుల రద్దీ ఉన్న రూట్లలోనూ బస్సుల సంఖ్యను పెంచడం లేదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఊళ్లకు వెళ్లాలంటే ప్రైవేట్​వెహికల్సే దిక్కవుతున్నాయి. గతంలో కూరగాయలు, పాల వ్యాపారులు, ఫస్ట్ షిఫ్ట్​ చేసే ఉద్యోగులు, వివిధ పనుల కోసం సిటీకి వచ్చేవాళ్లకు అనుకూలంగా నైట్​హాల్ట్​సర్వీసులు నడిచేవి. ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం వాటి మాటే లేకుండా చేశారు. గ్రేటర్​హైదరాబాద్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 

ఆర్టీసీ సమ్మెకు ముందు..

2019 ఆర్టీసీ సమ్మెకు ముందు సిటీ వ్యాప్తంగా 3,700 బస్సులు నడిచేవి. తర్వాత లాభాలు రావడం లేదని, పాత బస్సులను స్క్రాప్​చేస్తున్నామని వెయ్యి సర్వీసులను తగ్గించారు. అలాగే కరోనా టైంలో బస్సులు నడవక ఆర్టీసీకి తీవ్ర నష్టం వచ్చింది. దీంతో బస్సులు తిరిగి మొదలయ్యాక లాభాలు అంతగా లేని రూట్లలో ఒక్కో డిపో నుంచి15 నుంచి 30 బస్సులను రద్దు చేశారు. మెహిదీపట్నం డిపో నుంచి 40 ప్రైవేట్ బస్సులు నడుస్తుండగా ఇందులో 11 సర్వీసులను రద్దు చేశారు. దీంతో శివారు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ ​వ్యాప్తంగా 2,800 బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీసీ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉంది. 

అరకొరగానే..

గతంలో గ్రేటర్​లోని 3 వేల రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిచేవి. కరోనా తర్వాత ఇందులో సగం రూట్లలో మాత్రమే అరకొరగా నడుస్తున్నాయి. ఈ రూట్లలోని అన్ని బస్సులను ప్రారంభించినట్లు ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ ఇప్పటికీ 300కు పైగా రూట్లలో గతంలో నడిచే సర్వీసులు ప్రారంభం కాలేదు. అందులో 230 ఎన్ సికింద్రాబాద్ నుంచి నాగులూరు, దుండిగల్, 230 టీ సికింద్రాబాద్ నుంచి  దుండిగల్ తండా, 230 బీ సికింద్రాబాద్ నుంచి బౌరంపేట్, 445 మెహిదీపట్నం నుంచి కేతిరెడ్డిపల్లి వెళ్లే నైట్ హాల్ట్, 284 కోఠి నుంచి కాచబోయిన సింగారం, ప్రతాపసింగారం, 115 మేడిపల్లి నుంచి పర్వతాపురం వంటి సర్వీసులు ఉన్నాయి. 

చిరు వ్యాపారుల జేబులకు చిల్లు

బస్సుల్లేక శివారు ప్రాంతాల్లోని గ్రామల నుంచి సిటీకి వచ్చేవారు ప్రైవేట్ వాహనాలనే నమ్ముకుంటున్నారు. ప్రధానంగా చిరు ఉద్యోగులు, వ్యాపారుల కోసం గతంలో అన్ని రూట్లలో సిటీ బస్సులు తిరిగేవి. నైట్ హాల్ట్​ బస్సులు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ రద్దు చేయడంతో ప్రైవేట్, సొంత వాహనాలతో సిటీకి వస్తున్నారు. కూరగాయలు, పాల వ్యాపారులు సిటీకి సరుకు తెచ్చేందుకు దూరాన్ని బట్టి డైలీ రూ.1,500 నుంచి  రూ.3 వేల వరకు ఇస్తున్నారు.ఈ భారం భరించలేని చాలా మంది వ్యాపారాలకు దూరమైనట్లు సమాచారం. పాత సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తే మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది.

బస్సులు ఎందుకు నడపట్లే

టికెట్ల ధరల పెంచడం దృష్టి పెడుతున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కష్టాలను ఎందుకు పట్టించుకోవట్లేదు. ఇప్పటివరకు రెండు, మూడు సార్లు టికెట్ల ధరలు పెంచారు. అయినప్పటికీ అన్ని రూట్లలో బస్సులను ఎందుకు తిప్పట్లేదు. గతంలో ప్రతి ఐదు నిమిషాలకోసారి వచ్చే బస్సులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాగైతే జనం ఆర్టీసీని ఎలా నమ్ముతారు. 

- విగ్నేశ్​చారి, బీజేపీ లీడర్, దుండిగల్ 

ఆ సర్వీసులను మళ్లీ స్టార్ట్​చేయాలె

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి ప్రతిరోజు రాత్రి మెహిదీపట్నం నుంచి 445 సర్వీసు నంబర్​బస్సు వచ్చేది. లాక్ డౌన్ తర్వాత నైట్ హాల్ట్ సర్వీసు రద్దయింది. మా గ్రామంతో పాటు పలు గ్రామాలకు నడిచే నైట్ ఆల్ట్ సర్వీసులను ఆర్టీసీ ఆఫీసర్లు రద్దు చేశారు. వివిధ పనుల కోసం సిటీకి వచ్చి రాత్రిళ్లు గ్రామాలకు వెళ్లాలంటే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులను తిరిగి నడపాలి. 

‌‌‌‌- దారెడ్డి కృష్ణారెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్

బస్సులేకుండా పాసులతో లాభమేంటి?

బస్సులు లేనప్పుడు పాసులు తీసుకొని లాభమేంటి. ఉదయం పూట ఉన్న కొన్ని బస్సుల్లో ఇరుకుగా ప్రయాణించి డ్యూటీలకు వెళ్తున్నవారు సాయంత్రం ఆటోల్లో తిరిగి వస్తున్నారు. అకడమిక్​ఇయర్​స్టార్ట్​అవడంతో స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం అయ్యాయి. డిమాండ్​ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచకపోతే స్టూడెంట్లు చాలా ఇబ్బంది పడతారు. అధికారులు స్పందించి తీసేసిన బస్సులను తిరిగి నడపాలె.

- తుంగతుర్తి రవి, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్​ప్రెసిడెంట్ 

డిమాండ్ ఉంటే నడుపుతం

ఏ రూట్లోనైనా బస్సులకు డిమాండ్ ఉంటే బస్సులు నడుపుతాం. అవసరమైన ప్రాంతంలోని సమీప డిపో మేనేజర్​కి తెలియజేయొచ్చు. ఆ రూట్​లోని అవసరాన్ని బట్టి బస్సులు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. 

- యాదగిరి, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ