
చిత్తూరు జిల్లాలో తరుచుగా ఏనుగుల గుంపు సంచారం, దాడులు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఏనుగులు గుంపు పంటపొలాలపై పడి మామిడి,కొబ్బరి, అరటి తోటలను నాశనం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల దాడిలో స్థానికులు మృతిచెందడం, స్థానికులు రక్షణకోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ వైర్లు తాగి ఏనుగులు మృతిచెందడం, ఏనుగుల గుంపులో ఘర్షణలు ఏనుగులు చనిపోవడం వంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజా చిత్తూరు జిల్లాలోని కల్లూరు - సదుం మార్గంలో చిట్టారెడ్డిపేట దగ్గర సంచరిస్తున్న గుంపులో గున్న ఏనుగు అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం రేపుతోంది. నాలుగేళ్ల గున్న ఏనుగు మృతిచెందడంతో ఏనుగులు రెచ్చిపోయాయి. ఆ ప్రాంతంలో అడుగుపెట్టేందుకు స్థానికులు, ఫారెస్ట్ అధికారులు భయపడుతున్నారు.
కల్లూరు-సదుం మార్గంలో చిట్టారెడ్డిపేట దగ్గర ఏనుగు వెదురు పొదల్లో మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే చుట్టూ పక్కల గ్రామాల నుండి ఏనుగును చూసేందుకు పెద్దెత్తున తరలివచ్చారు. ఇటీవల పులిచర్ల మండలం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ మామిడి, కొబ్బరి, అరటి ఇతర పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ఏనుగు మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
పులిచెర్ల మండలం పెద్ద ఒడ్డు సమీపంలో చెరువు కట్టపై సంచరిస్తున్న గున్న ఏనుగు జారి పడి మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా పులిచెర్ల కొండ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అర్ధరాత్రి కల్లూరు సమీపంలో ఏనుగుల గుంపు వచ్చి బీభత్సం సృష్టించాయి.
పులిచెర్ల(మం)లో తిష్ట వేసిన ఏనుగుల గుంపు పాత పేట అటవీ ప్రాంతంలో పంటపొలాలను ధ్వంసం చేశాయి. మామిడి,అరటి,టమోటా తోటలను ఏనుగుల గుంపు తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో తమ పంటలు తీవ్రంగా నష్టపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏనుగుల గుంపును చూసి పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు రైతులు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
►ALSO READ | తిరుమల కొండపై మంటలు : వేగంగా స్పందించటంతో తప్పిన ప్రమాదం
చిత్తూరు జిల్లాలో తరచుగా ఏనుగుల మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో ఈ జిల్లాలో చాలా ఏనుగులు మృత్యువాత పడ్డాయి. విద్యుదాఘాతం, రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు, రోడ్డు ప్రమాదాలు, మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు ఏనుగుల మరణాలకు దారితీస్తున్నాయి. కొన్నిసార్లు ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేయడం, రైతులపై దాడి చేసి ప్రాణాలు తీయడం వంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. తాజా ఘటనలో గుంపులో జరిగిన ఘర్షణ కారణంగా గున్న ఏనుగు మృతి చెందిందని అటవీ అధికారులు భావిస్తున్నారు. తిరుపతి జూపార్క్ వెటర్నరీ డాక్టర్ అరుణ ఏనుగు కళేబరానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయంటున్నారు అధికారులు.