
ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే.. సెకండ్ హ్యాండ్ లో కారు కొనాలనుకునే వాళ్లు ఢిల్లీ వైపు చూస్తున్నారు.. కారణం ఏంటంటే.. ఢిల్లీలో 60 లక్షల వాహనాలపై బ్యాన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ 60 లక్షల్లో కార్లు, బైక్స్, ఆటోలు, లారీలు, గూడ్స్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు.. 10 ఏళ్లు దాటిన డీజిల్ వెహికల్స్ రోడ్డుపై తిరగటానికి వీల్లేదని బ్యాన్ విధించింది ఢిల్లీ సర్కార్. పొల్యూషన్ కంట్రోల్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవటమే కాకుండా.. అలాంటి వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ సర్కార్. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు రావటంతో.. ఈ నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇదే సమయంలో వాహనదారుల మూడ్ కూడా మారిపోయింది. ఇప్పుడు కాకపోతే.. మరికొన్ని సంవత్సరాలు అంటే.. ఒకటి, రెండేళ్లలో పూర్తిగా బ్యాన్ విధిస్తారని.. ఇలాంటి వాహనదారులకు ప్రభుత్వం ఓ సంకేతం పంపిందని డిసైడ్ అయ్యారు ఢిల్లీలోని వాహనదారులు. ఈ క్రమంలోనే తమ పాత వాహనాలను అమ్మేయటానికి ఫిక్స్ అయ్యారు. ఇప్పటికిప్పుడు బ్యాన్ తాత్కాలికంగా ఆగినా.. రాబోయే రోజుల్లో వచ్చే తలనొప్పులతో వాహనాలను అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో తమ కార్లు, బైక్స్, ఆటోలు, ఇతర వాహనాలను అమ్మకానికి పెడుతున్నారు. 15 ఏళ్ల పెట్రోల్ కారు అంటే ఆల్ మోస్ట్ ఓసారి బోరు కూడా చేయించి ఉంటారు.. ఇలాంటి వాహనాలను లక్షా, రెండు లక్షలకు అమ్మకానికి పెట్టేస్తున్నారు ఢిల్లీలోని వాహనదారులు.
జీవితకాలం ముగిసిన వాహనాలపై బ్యాన్ నిర్ణయంతో ఢిల్లీలో అమ్మకానికి ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల సంఖ్య భారీగా పెరిగిపోయిందని ట్రేడర్లు చెబుతున్నారు. వాహన యజమానులు వెంటనే తమ కార్లను అమ్మేయాలనుకోవటంతో ధరలు 40 నుంచి 50 శాతం పడిపోయినట్లు చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ శుక్రవారం వెల్లడించింది. అక్కడి వ్యాపారులు కూడా వాస్తవ ధరలకంటే చాలా తక్కువకే సెకండ్ హ్యాండ్ కార్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి గడచిన 5 రోజులుగా ఉన్నట్లు రిపోర్ట్ చెప్పింది.
ప్రధానంగా ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ కార్లకు దేశంలోని పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఎక్కువడా డిమాండ్ ఉంటుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో అమ్మకానికి వస్తున్న కార్ల సంఖ్య పెరగటంతో వాటిని కొనేవారు కూడా రేట్లు భారీగా తగ్గించి అడుగుతున్నట్లు వెల్లడైంది. గతంలో ఒక లగ్జరీ కారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలు పలకగా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు వాటిని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు అడుగుతున్నారని ఢిల్లీలోని వ్యాపారులు చెబుతున్నారు.
దీనికి తోడు కార్లను అమ్మేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను రవాణా శాఖ నుంచి పొందటం కూడా కష్టతరంగా మారిందని ఢిల్లీ కార్ డీలర్లు చెబుతున్నారు. గతంలో ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉండేదని, పాత వాహనాల బ్యాన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయిందంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఖరీదైన ఎస్ యూవీలు, లగ్జరీ కార్లనే రూ.4 నుంచి రూ.5 లక్షలకు అడుగుతున్న నేపథ్యంలో అనేక బేసిక్ మోడల్ వాహనాలను అక్కడి యజమానలు లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకే అమ్మేసేందుకు పోటీ పడుతున్నారు. వీలైనంత క్యాష్ చేసుకునేందుకు వారిలోవారే పోటీపడుతుండటంతో కొందరు ఓఎల్ఎక్స్ వంటి ఆన్ లైన్ మాద్యమాల్లో తమ కార్లను అమ్మేందుకు లిస్ట్ చేస్తున్నారని తేలింది. సరిగ్గా వెతుక్కుంటే లక్షకే ఒక మంచి కారును సొంతం చేసుకోవచ్చని ఆటో డీలర్లు కూడా సూచిస్తున్నారు.