నో నెట్ వర్క్.. నో ఏటీఎం .. కొమురవెల్లిలో మల్లన్న భక్తులకు కష్టాలు

నో నెట్ వర్క్.. నో ఏటీఎం .. కొమురవెల్లిలో మల్లన్న భక్తులకు కష్టాలు
  • ఏటీఎంలు లేక, ఫోన్లు కల్వక తిప్పలు
  • వ్యాపారులకు కమీషన్ ఇస్తేనే క్యాష్
  • కోనేరు చుట్టూ మురుగు నీరు

కొమురవెల్లి, వెలుగు : ప్రస్తుత రోజుల్లో మారుమూల గ్రామాల్లో సైతం నెట్ వర్క్, ఏటీఎంలు కనిపిస్తుంటాయి. కానీ ఎంతో పేరున్న కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులకు మాత్రం ఈ రెండింటి విషయంలో కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం కొమురవెళ్లి మల్లన్న జాతర జరుగతుండడంతో మూడు నెలల పాటు వేలాది మంది భక్తులు మల్లన్న దర్శనానికి వస్తున్నారు.

ఇక్కడ సెల్ సిగ్నల్స్ లేకపోవడం, ఏటీఎంలు కనిపించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన రెండు ఏటీఎం మిషన్లను ఆఫీసర్లు ఇటీవల తొలగించారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దుకాణదారులు కమీషన్లు తీసుకొని భక్తులకు నగదు అందజేస్తున్నారు. ప్రస్తుతం ఇది పలు దుకాణదారులకు ఓ వ్యాపారంగా మారింది. 

కమిషన్ ఇస్తేనే క్యాష్

కొమురవెల్లిలో ఏటీఎంలు లేకపోవడంతో భక్తులు దుకాణదారులకు యూపీఐ యాప్ ల ద్వారా పేమెంట్లు చేసి నగదు తీసుకుంటున్నారు. అయితే ఇందుకు దుకాణదారులు భక్తుల నుంచి కొంత మొత్తంలో కమీషన్ వసూలు చేస్తున్నారు. రూ. 1000 నగదు కావాలంటే రూ. 30 నుంచి రూ. 50 వరకు కమీషన్ రూపంలో చెల్లించుకోవాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొస్తే ఇబ్బందులు తప్పుతాయని భక్తులు అంటున్నారు.

రద్దీ టైంలో నెట్ వర్క్ సమస్య

కొమురవెల్లిలో వారాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ టైంలో నెట్ వర్క్ సమస్య తీవ్రం అవుతోంది. దీని వల్ల అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, డిజిటల్ పేమెంట్ చేయాలన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల టైంలో, ప్రతి ఆదివారం సిగ్నల్స్ సమస్య ఏర్పడుతుందని భక్తులు చెబుతున్నారు.

కొమురవెల్లిలో బీఎస్ ఎన్ ఎల్, ఎయిర్ టెల్, జియో, ఐడియా టవర్స్ ఉన్నప్పటికీ రద్దీ టైంలో వాటి కెపాసిటీ సరిపోవడం లేదు. నెట్ వర్క్ సమస్య కారణంగా డిజిటల్ పేమెంట్లు జరగకపోవడంతో భక్తులు, దుకాణదారుల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. జాతర టైంలో ఫోన్ చేయాలంటే కనీసం గంట పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. 

ALSO READ : రోడ్డెక్కిన పల్లి రైతులు.. ధర తగ్గించారని ఆగ్రహం

తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లిలో ఆలయ పరిసరాలు సైతం సరిగా లేకపోవడంతో భక్తులతు ఇబ్బందులు తప్పడం లేదు. మల్లన్న దర్శనానికి వచ్చే వారికి గుంతల రోడ్లు, అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులే స్వాగతం పలుకుతున్నాయి. కనీస సౌకర్యాలైన మంచినీరు, మొబైల్ టాయిలెట్స్, స్నాన ఘట్టాలు లేకపోవడంతో పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్లన్న కోనేరు నుంచి రాతి గీరల వరకు డ్రైనేజీ నీళ్లు నిలిచిపోవడంతో భక్తులు ఆ నీటిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫీసర్లు స్పందించి సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

‘క్యాష్ అవసరమై కొమురవెల్లి మొత్తం తిరిగిన. ఎక్కడా ఒక్క ఏటీఎం కూడా కనపడలేదు. ఇక చేసేదేం లేక ఇక్కడి ఓ దుకాణం యజమానికి వెయ్యి రూపాయలు డిజిటల్ పేమెంట్ చేశాను. రూ.50 కమీషన్​తీసుకుని రూ.950 క్యాష్​ఇచ్చాడు. ఇది నా ఒక్కడి సమస్యే కాదు. కొమురవెల్లికి వచ్చే ప్రతి భక్తుడు ఇదే ప్రాబ్లం ఫేస్​చేస్తున్నాడు. సామాన్య భక్తులకు ఏటీఎం అందుబాటులో లేకపోవడంతో నగదు కోసం ఇబ్బంది పడుతున్నారు.’ - ప్రదీప్, భక్తుడు, రామగుండం, పెద్దపల్లి జిల్లా