బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నామినేషన్లు వద్దు

బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నామినేషన్లు వద్దు
  • జవహర్​లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ప్రకటన  

హైదరాబాద్, వెలుగు:  అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలని సొసైటీ సభ్యులు కొందరు పిలుపునివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జవహర్​లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్​ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సీఈఓ ఎన్. వంశీ శ్రీనివాస్ తెలిపారు. సొసైటీకి రాజకీయ పార్టీలతో, పాలిటిక్స్​తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకరిద్దరు రాజకీయ కారణాలతో సొసైటీ ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తే చర్యలు తీసుకుంటామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.

కొందరు సభ్యులు ఆవేదనతో, ఆవేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలని చెప్తే వారించినట్లు పేర్కొన్నారు. రాజకీయం చేస్తే పరిష్కారం మరింత క్లిష్టం అవుతుందని అని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారని స్పష్టం చేశారు. మొత్తం 70 ఎకరాల్లో 32 ఎకరాలు సొసైటీకి హ్యాండోవర్ అయ్యాయని.. ఇంకో 38 ఎకరాలు సొసైటీకి ఇవ్వడంలోనే తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా దీనిపై కదలిక లేకపోవడం మాత్రం బాధాకరమన్నారు.