- ఒక జిల్లాకు ఒకే సెషన్‌లో పరీక్ష పెట్టినందున ఇబ్బందులు ఉండవని అధికారుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల జరిగిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఫలితాల్లో ‘నార్మలైజేషన్’ ప్రక్రియ ఉండదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో నార్మలైజేషన్ ఉంటుందన్న ప్రచారం జరిగినా.. అధికారుల తాజా నిర్ణయంతో ఆ గందరగోళానికి తెరపడింది. నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని పేర్కొనకపోవడం, జిల్లాకు ఒకే సెషన్ చొప్పున పరీక్ష నిర్వహించడంతో నార్మలైజేషన్ అవసరం లేదని అధికారులు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా ఈ విధానాన్ని తెస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
జిల్లాకు ఒకే సెషన్..
సాధారణంగా ఆన్‌లైన్ పరీక్షలు వేర్వేరు సెషన్లలో జరిగినప్పుడు.. ఒక పేపర్ కఠినంగా, మరో పేపర్ సులభంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. దీంతో అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు ‘నార్మలైజేషన్’ చేస్తారు. అయితే, దాదాపు ప్రతి జిల్లా అభ్యర్థులకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించారు. దీంతో ఆయా జిల్లాల అభ్యర్థులందరికీ ఒకే రకమైన క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఎవరికీ అన్యాయం జరగలేదని, అందుకే నార్మలైజేషన్ అవసరం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు.
ఏపీలో సెంటర్లు తక్కువగా ఉండటం, ఒకే జిల్లా అభ్యర్థులను వేర్వేరు సెషన్లకు విభజించడంతో అక్కడ నార్మలైజేషన్ తప్పనిసరి అయ్యిందని, మన దగ్గర ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ నెల 30న టెట్ ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘కీ’లో తప్పులు దొర్లకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ ఆదేశాలతో ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణుల కమిటీని వేశారు. ఈ కమిటీ మరోసారి ఆన్సర్లను క్షుణ్నంగా చెక్ చేశాకే ‘కీ’ని రిలీజ్ చేయనున్నారు
