రహస్యంగా ఆ వీడియోలు చూస్తున్నారా.. అయితే నేరం కాదు.. : హైకోర్టు సంచలన తీర్పు

రహస్యంగా ఆ వీడియోలు చూస్తున్నారా.. అయితే నేరం కాదు.. : హైకోర్టు సంచలన తీర్పు

ప్రైవేట్‌గా అశ్లీల ఫోటోలు లేదా వీడియోలు చూడటం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం అశ్లీలత నేరంగా పరిగణించబడదని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. 2016 జూలైలో అలువా మున్సిపాలిటీ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నందుకు పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సెప్టెంబర్ 5న ఈ తీర్పు ఇచ్చింది. సెక్షన్ 292 కింద తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను రద్దు చేయాలని నిందితుడు కోర్టును ఆశ్రయించాడు.

“ఒక వ్యక్తి  ప్రైవేట్ గా పోర్న్ వీడియోను చూడడం నేరంగా పరిగణిస్తారా అనేది ఈ కేసులో నిర్ణయించాల్సిన ప్రశ్న. న్యాయస్థానం దీన్ని.. అతని వ్యక్తిగత ఎంపిక అనే సాధారణ కారణంతో నేరంగా పరిగణించదు. అదే విధంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అతని గోప్యతకు భంగం కలిగిస్తుంది”అని జస్టిస్ పివి కున్హికృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు వివరాలను ఉటంకిస్తూ, పిటిషనర్ వీడియోను బహిరంగంగా ప్రదర్శించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించలేదని కోర్టు తెలిపింది.

“ఒక వ్యక్తి ఎవరికీ తెలియకుండా అశ్లీల ఫొటోలు లేదా వీడియోలను చూడటం అనేది సెక్షన్ 292 IPC  ప్రకారం నేరం కాదు”అని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. "నిందితుడు ఏదైనా అసభ్యకరమైన వీడియోలు లేదా ఫోటోలను ప్రసారం చేయడానికి లేదా పంపిణీ చేయడానికి లేదా బహిరంగంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, సెక్షన్ 292 IPC కింద మాత్రమే నేరంగా పరిగణించబడుతుందని" వెల్లడించింది.

ఈ క్రమంలో కేసు నమోదైన నిందితుడిపై క్రిమినల్‌ కేసులను కోర్టు కొట్టివేసింది. అనంతరం.. పర్యవేక్షణ లేకుండా పిల్లలకు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్లను ఇవ్వడంపై న్యాయమూర్తి తల్లిదండ్రులను హెచ్చరించారు.