మునుగోడులో పాదయాత్ర, ప్రచారానికి ఎవరూ పిలవలేదు

మునుగోడులో పాదయాత్ర, ప్రచారానికి ఎవరూ పిలవలేదు

అయినా మేం హోంగార్డులం.. ఐపీఎస్​లే పార్టీని గెలిపించుకోవాలి: వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో పాదయాత్ర, ప్రచారానికి తనను ఎవరూ పిలవలేదని, పిలవని పేరంటానికి ఎవరైనా వెళ్తారా అని కాంగ్రెస్ ​సీనియర్​ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మునుగోడు బై పోల్​గురించి తనతో ఎవరూ ఏమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా మాణిక్కం ఠాగూర్​ హైదరాబాద్​లోనే ఉన్నా తనను సంప్రదించలేదన్నారు. అయినా తాము హోం గార్డులమని, ఐపీఎస్​లే పార్టీని గెలిపించుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్​లో ఆయన తన నివాసంలో ‘వీ6 వెలుగు’తో మాట్లాడారు. ‘‘చండూరులో నాకు తెలియకుండా సభ పెట్టించి చిన్న పిల్లలతో నన్ను తిట్టించిన్రు. హోంగార్డులు 30, 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా ఐపీఎస్​ల మాట వినాల్సిందే. నేను, జానారెడ్డి లాంటి లీడర్లందరూ హోంగార్డులం, నిన్న మొన్న వచ్చినోళ్లంతా ఐపీఎస్​లు అనుకుంటే వాళ్లే పార్టీని గెలిపించుకోవాలి. నాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్​కు షోకాజ్​ నోటీస్​ ఇవ్వడం ఒక డ్రామా. తెలంగాణ కోసం మంత్రిపదవిని వదులుకొని, 16 రోజులు నిరాహార దీక్ష చేసి పార్టీ కోసం కష్టపడితే, ఎవరో పిల్లలు నన్నేదో అంటే అక్కడే వాళ్లను చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పాల్సింది. అసలు క్షమాపణ చెప్పాల్సింది రేవంతే. ఆయనే సభ పెట్టించిన్రు. కాబట్టి సారీ చెప్పాల్సింది కూడా రేవంతే. నేను ఢిల్లీలో ఉండగానే నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పార్టీలో ఎట్లా చేర్చుకుంటరు? నేను మల్కాజ్​గిరి, కొడంగల్​కు వెళ్లి చేర్చుకోలేనా? వెంకట్​రెడ్డి అంటే  తమాషాగా ఉందా?” అని ఆయన ప్రశ్నించారు.

దాసోజు లాంటి మంచి లీడర్​ను వదులుకోవడం కరెక్ట్​ కాదని ఆయన పేర్కొన్నారు. గతంలో తనను హుజూరాబాద్​, దుబ్బాక, నాగార్జునసాగర్​ఎన్నికల ప్రచారానికి పిలిస్తే అక్కడే ఉండి డబ్బు ఖర్చుపెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని, మునుగోడులో మాత్రం ఎవరూ తనకు ఏ బాధ్యత కూడా అప్పజెప్పలేదని తెలిపారు. వాళ్లే కమిటీలు వేసుకుంటున్నారని, జానారెడ్డే ఆ పనులన్నీ చూసుకుంటారేమోనని వ్యాఖ్యానించారు. అలాగే తాను పార్టీ మారేది లేదని రేవంత్​కు ఢిల్లీలో స్పష్టం చేశానని, అయినా సీనియర్లను అవమానపరిచేలా మాట్లాడడం కరెక్ట్​కాదని హితవు పలికారు. ఎవరేమన్నా తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్​తోనే ఉంటానని స్పష్టం చేశారు. ఏ విషయమైనా సోనియా, రాహుల్​ సమక్షంలో తేల్చుకుంటానని వెంకట్​రెడ్డి చెప్పారు.