సంగీత కచేరి వేదికపై జిహాదీల దాడి.. బంగ్లాదేశ్లో సింగర్ ప్రోగ్రాం రద్దు

 సంగీత కచేరి వేదికపై జిహాదీల దాడి..  బంగ్లాదేశ్లో సింగర్ ప్రోగ్రాం రద్దు
  • అటాక్ లో 25 మందికి గాయాలు 
  • దాడిని తీవ్రంగా ఖండించిన తస్లీమా నస్రీన్

ఢాకా: బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ లో జిహాదీలు బీభత్సం సృష్టించారు. ఆ దేశ సింగర్  జేమ్స్  సంగీత కచేరి ప్రోగ్రాంపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో కార్యక్రమం మధ్యలోనే రద్దయింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఢాకాకు 120 కిలోమీటర్ల  దూరంలోని ఫరీద్ పూర్  లో జేమ్స్  కచేరీ జరుగుతుండగా కొంతమంది జిహాదీలు బలవంతంగా వేదిక ప్రాంతంలోకి చొరబడ్డారు. వారిని అడ్డుకునేందుకు  స్థానికులు, స్టూడెంట్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. వేదికలోకి చొరబడ్డాక కార్యక్రమానికి హాజరైన వారిపై రాళ్లు, ఇటుకలు విసిరేశారు. దీంతో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనను అజ్ఞాతంలో ఉన్న ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్  ‘ఎక్స్’ లో తీవ్రంగా ఖండించారు. 

బంగ్లాదేశ్ లో పరిస్థితులు భీకరంగా మారుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కల్చరల్  సెంటర్  ఛాయనౌత్ ను జిహాదీలు తగులబెట్టేశారు. దేశంలో సంగీతం, నాటకాలు, డ్యాన్స్, జానపద సంస్కృతిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఉదిచి సంస్థను కూడా నాశనం చేశారు. జిహాదీ మతోన్మాదుల కారణంగా జేమ్స్  ప్రదర్శన రద్దయింది. కొద్ది రోజుల క్రితమే ఉస్తాద్  అల్లావుద్దీన్  ఖాన్ (ప్రపంచ ప్రఖ్యాత మ్యాస్ట్రో) కొడుకు సిరాజ్  అలీఖాన్  ఢాకాకు వచ్చారు. ఇక్కడి పరిస్థితులు చూసి ప్రదర్శన ఇవ్వకుండానే ఆయన భారత్ కు వెళ్లిపోయారు. 

కళాకారులు, కళలకు రక్షణ కలిగే వరకూ మళ్లీ బంగ్లాదేశ్ లోకి అడుగుపెట్టబోనని ఆయన శపథం చేశారు” అని తస్లీమా పేర్కొన్నారు. అలాగే, ఉస్తాద్  రషీద్  ఖాన్  కొడుకు అర్మాన్  ఖాన్  కూడా ఢాకాకు రావడానికి ఒప్పుకోలేదని ఆమె తెలిపారు. సంగీతాన్ని ద్వేషించే జిహాదీలు బంగ్లాదేశ్ లో ఉన్నంతకాలం ఆ దేశంలోకి అడుగుపెట్టబోనని ఆయన కూడా శపథం చేశారని గుర్తుచేశారు.