
- అసమానతలు ఉన్నత కాలం
- ఎర్ర జెండా పోరాటాలుంటాయి
- మోదీ, అమిత్షాది రక్త దాహం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్
బెల్లంపల్లి, వెలుగు: దేశంలో అసమానతలు ఉన్నంత కాలం ఎర్ర జెండా పోరాటాలు కొనసాగుతాయని, మావోయిస్టు పార్టీని ఎవరూ నిర్మూలించలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన పార్టీ 21వ పట్టణ మహాసభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు గుండా సరోజన ఎర్ర జెండాను ఆవిష్కరించారు. పార్టీ టౌన్ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షత వహించిన కార్యక్రమానికి కలవేణి శంకర్ హాజరైన మాట్లాడారు.
సామ్రాజ్యవాదుల చెప్పుచేతుల్లో దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మతోన్మాద విధానాలు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ‘అపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టు పార్టీ, ఆదివాసీ, గిరిజనులపై యుద్ధం చేసి, వేలాది మందిని కాల్చిచంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజును కాల్చిచంపి మోదీ, అమిత్ షా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ మహాసభలకు పార్టీ సన్నద్ధమవుతోందని తెలిపారు. మహాసభల ద్వారా దేశంలో సీపీఐ పునర్నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. మహాసభల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, రేగొండ చంద్రశేఖర్, సీనియర్ నేత చిప్ప నర్సయ్య, నాయకులు డీఆర్ శ్రీధర్, బొంతల లక్ష్మీనారాయణ, అక్కెపల్లి బాపు, మేకల రాజేశం తదితరులు పాల్గొన్నారు.