ఎవరికేం తెలియదన్న ‘జాక్’.. మ్యాజిక్ అందరికీ తెలుసన్న‘మస్క్’

ఎవరికేం తెలియదన్న ‘జాక్’.. మ్యాజిక్ అందరికీ తెలుసన్న‘మస్క్’

ట్విట్టర్ ప్రస్తుత యజమాని ఎలాన్ మస్క్.. మాజీ యజమాని జాక్ డోర్సే మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఇవాళ ఉదయాన్నే ట్విట్టర్ మాజీ యజమాని జాక్ డోర్సే.. ‘‘ఎవరికీ ఏమీ తెలియదు’’ అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత 5 గంటల్లోనే దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘మ్యాజిక్ 8 అందరికీ తెలుసు’’ అని బదులిచ్చారు.  తన ట్వీట్ కు జాక్ డోర్సే అకౌంట్ ను ట్యాగ్ చేశారు.  వీరిద్దరి మధ్య ఈవిధమైన ట్వీట్ వార్ జరగడం ఇదే తొలిసారేం కాదు. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి పలుమార్లు ఈవిధమైన డిస్కషన్ మస్క్, డోర్సే మధ్య జరిగింది. 

నవంబరు మొదటివారంలో ట్విట్టర్ భవిష్యత్ ప్రణాళికపై ఇద్దరు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.. పరస్పరం సమాధానాలిస్తూ ట్వీట్లు చేసుకున్నారు. ట్విట్టర్ లోని ‘బర్డ్‌వాచ్‌’ ఫీచర్ పేరును ‘కమ్యూనిటీ నోట్స్‌’గా మారుస్తూ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై స్పందించిన జాక్ డోర్సే.. ‘‘బర్డ్ వాచ్ అనే పాత పేరే బాగుంది. కమ్యూనిటీ నోట్స్‌ అనే పేరు బోరింగ్‌గా ఉంది’’ అని విమర్శించారు. దీనికి మస్క్‌ బదులిస్తూ.. ‘‘బర్డ్‌వాచ్‌ పేరు నాకు కూడా నచ్చలేదు. అయినా ప్రతి పేరులోనూ పక్షి ఉండాల్సిన అవసరం లేదు కదా’’ అని డోర్సేకు కౌంటర్ ఇచ్చారు. 

‘‘ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన సమాచార మాధ్యమంగా  ట్విట్టర్ ఎదగాలి. అదే మన మిషన్’’ అని  అంటూ నవంబరు 7న ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన జాక్ డోర్సే.. ‘‘ఎవరికి పారదర్శకంగా ఉండాలి ?’’ అనే ప్రశ్నను సంధించారు. 

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న వారం రోజుల్లోనే కంపెనీలో సగం మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఈ నిర్ణయాన్ని జాక్ డోర్సే తప్పుపట్టారు. ట్విట్టర్  ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. వారు ఎదుర్కొంటున్న ప్రతికూల  పరిస్థితులకు పూర్తి బాధ్యత తనదేనని కామెంట్ చేశారు.